naganna

పింఛన్ ఇవ్వండి సారూ..!

  • అర్హత ఉన్న పింఛన్ తీసేశారు
  • స్పందనలో వృద్ధురాలి ఆవేదన
  • సరిచేయమంటూ వేడుకోలు
  • సొమ్మసిల్లి పడిపోయిన ముసలవ్వ..

పింఛన్ ఇవ్వండి సారూ..!

ఆస్పరి (పల్లెవెలుగు) అక్టోబర్ 4 : అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు తొలగించడం లేదని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే అధికారుల నిర్వాకమో.. మరే కారణమో.. అర్హులకు కూడా ఇస్తున్న పింఛను తీసివేయడంతో వారు లబోదిబోమంటున్నారు. అటువంటి ఉదంతాలు ఏమీ లేవని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ.. అన్ని అర్హతలు కలిగి అధికారుల నిర్వాకంతో పింఛన్ పోగొట్టుకున్న వృద్ధురాలి ఉదంతం కన్నీరు తెప్పిస్తుంది. వివరాల్లోకెళితే… మండల పరిధిలోని తొగలగల్లు గ్రామానికి చెందిన దళిత ఈశ్వరమ్మ పండు వృద్ధురాలు.75 రూపాయలు పింఛన్ నుండి ఇప్పటివరకు సామాజిక భద్రత పింఛన్ పొందుతూ వచ్చారు. ఈమె కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ కూడా పెళ్లిళ్లు చేశారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు వలస బాట పట్టాడు. ప్రభుత్వం అందజేస్తున్న సామాజిక భద్రత పింఛనే ఆ వృద్ధురాలికి జీవనాధారం. వృద్ధురాలికి సకాలంలో పింఛన్ అందజేస్తేనే పూట గడిచేది. అయితే ప్రభుత్వం అనర్హుల జాబితాలో ఐడి నెంబర్ 113618737 ను ఉంచింది. దీంతో గత రెండు నెలలు కాలం నుండి ఆ వృద్ధురాలి పింఛన్ ను అధికారులు నిలిపివేశారు. తమకు గతంలో పింఛన్ వచ్చేదని, ప్రస్తుతం రావడం లేదని సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి అతి కష్టం మీద తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులలో ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎండలో వచ్చి అలసిపోయిన ముసలవ్వ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అదే సమయంలో అక్కడే పని నిమిత్తం ఉన్నా బన్నూరు మాజీ సర్పంచ్ సీతారాం రెడ్డి సొమ్మసిల్లి పడిపోయిన ముసలవ్వకు మంచినీరు అందించి, చెట్టు నీడ కిందకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. కనీసం పింఛన్‌తోనైనా బతుకుదామని ఆశతో ఉంటే వస్తున్న పింఛన్ కూడా కట్ చేశారని, నాకు ఎలాగైనా పింఛన్ ఇప్పించాలని వివిధ పనుల నిమిత్తం తాసిల్దార్ కార్యాలయానికి వచ్చిన వాళ్ళని ముసలవ్వ చేతులెత్తి  వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కళించి వేశాయి.

Back to top button