naganna

ఉల్లికి తెగులు.. రైతులు దిగులు..!!

  • –ఉల్లిపైరుకు బూజు తెగుళ్ల…
  • –ఉల్లి పంటను తొలగించిన రైతు
  • –పత్తాలేని వ్యవసాయ అధికారులు

ఆస్పరి (పల్లె వెలుగు) 14 ఆగస్టు : ఆస్పరి మండలం ఉల్లి పంటకు నిలయం. ఈ ఏడాది ఉల్లి ఆశాజనకంగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి రైతు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంటలు బాగా పండితే కష్టాలు తొలగిపోతాయని ఆశతో పెట్టుబడులకు కూడా వెనకాడకుండా ఎరువులు, పురుగుల మందులు వాడారు. నెలలో చేతికి పంట వస్తుందని సంబర పడుతున్న తరుణంలో అంతుచిక్కని తెగుళ్లు సోకడంతో కళ్ళు ఎదుటే ఉల్లి పంటను తొలగించుకోవా కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఉల్లి పై పెట్టుకున్న ఆశలు ఆవిరి కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. తెగుళ్ళ బారిన పడి పంట సర్వనాశనం అవుతున్న వ్యవసాయ అధికారులు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లిపైరుకు బూజు తెగుళ్లు సోకడంతో రైతు ఆందోళన చెంది ఉల్లి పంట పైరును గుంటుక పోసి తొలిగించిన సంఘటన ఆస్పరి మండల పరిధిలోని హలిగేర గ్రామ రెవెన్యూ పరిధిలోని నల్లగుట్టయ్య స్వామి దేవాలయం దగ్గర చోటుచేసుకుంది. హలిగేర గ్రామ రెవెన్యూ పరిధిలోని రైతులు వందల ఎకరాల్లో ఉల్లి పంటను ఖరీఫ్ సీజన్లో సాగుచేశారు. పింజ దిశలో పంటకు బూజు తెగుళ్లు సోకడంతో పైరు వాడిపోతుందని, తెగుళ్లను నివారణకు క్రిమిసంహారక మందులు పంటపై పిచికారి చేసినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. తెగుళ్లతో పంట పెరుగుదల లేక మొక్క పచ్చగా మారి ఆకులు వాడు పడుతున్నాయని రైతులు తెలిపారు. ఎకరాకు రూ. 50 వేలు పెట్టుబడి పెట్టారు. 50 నుంచి 60 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా బూజు తెగుళ్ల కారణంగా ప్రస్తుతం ఉల్లి పైరును గుంటుక పోసి తొలగించినట్లు రైతులు వాపోయారు.

ఇలాంటి తెగుళ్ళు ఎప్పుడూ చూడలేదు –రైతు నాగార్జున

మా పెద్దల కాలం నుండి బావుల కింద ఉల్లి పంటను పండిస్తున్నామని, ఇలాంటి తెగుళ్లను ఎప్పుడూ చూడలేదని, ఎరువులు, పురుగుల మందులు వాడినప్పటికీ తగ్గకపోవడంతో ఉల్లి పంటను గుంటుక పోసి తొలగించినట్లు రైతు నాగార్జున పేర్కొన్నారు. ఎకరం నర పొలంలో 80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంటను సాగు చేసి నష్టపోయినట్లు రైతు తెలిపారు.

ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి –సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి

పంట నష్టపోయిన ప్రతి ఉల్లి రైతునూ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి అన్నారు. అంతుచిక్కని వైరస్ తో ఉల్లి పంటలో  తెగుళ్ళు వచ్చాయని  రైతులు ఎకరాకు రూ.50 వేల మేర పెట్టుబడులు పెట్టి, పంట సాగు చేశారన్నారు. తెగుళ్లతో పంట నష్టపోతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులుగానీ ఇటువైపు తిరిగి చూడడం లేదని, చేతికొచ్చిన పంట కళ్లముందే పాడవుతుండటంతో రైతులు కంటతడి పెడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to top button
Enable Notifications    OK No thanks