
భజనతో కాదు బాధ్యతగా – పార్టీలతో కాదు ప్రభుత్వంతో మమేకమై పనిచేస్తున్నాం
కె. కోటపాడు (పల్లెవెలుగు) 16 ఆగష్టు : భజనతో కాదు బాధ్యతగా – పార్టీలతో కాదు ప్రభుత్వంతో మమేకమై పనిచేస్తున్న మాకు ఎప్పటినుండో ఉన్న న్యాయమైన కోర్కెలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యోగుల సంఘం కోటపాడు తాలూకా యూనిట్ సభ్యులు సోమవారం ఎమ్మార్వో కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఉద్యోగుల సంఘం అధ్యక్షులు టి ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ నుండి అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా దాటవేస్తోందని అన్నారు. పార్టీల తో కాకుండా ప్రభుత్వం తోనే పని చేస్తున్నామని, మా ప్రధాన సమస్యలైన సి పి ఎస్ విధానం రద్దు కోరుతూ, డి ఎస్ సి ద్వారా ఎంపికైన పారామెడికల్ సిబ్బందిని క్రమబద్దీకరించడం, 11వ పిఆర్సి తక్షణమే అమలు పరచుట, బకాయి పడ్డ 6 డిఎలు వెంటనే విడుదల చేయాలని ఈ న్యాయమైన కోర్కెలను ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరిగిందని తెలిపారు. 2018 లో ప్రతిపక్ష హోదాలో ఉన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఈ సమస్యలన్నీ నివేదించడంతో సానుకూలంగా స్పందించి హామీ కూడా ఇచ్చి వున్నారు. కావున పైన తెలిపిన మా సమస్యలను నెరవేర్చాలని కోరుతూ కే కోటపాడు తాలూకా ఉద్యోగుల నాయకులు అసోసియేట్ ప్రెసిడెంట్ బి.వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కె శ్రీనివాసరావు, కోశాధికారి వి,ఏ సుబ్బారావు , జాయింట్ సెక్రెటరీ డి ఎస్ ఎన్. రాజు, సి హెచ్ సి. కాంట్రాక్టు సిబ్బంది సురేష్, నారాయణ రావు,రాజు తదితరులు ఎమ్మార్వో మర్రి లక్ష్మికి కోవిడ్ నిబంధనలకు లోబడి వినతి పత్రాన్ని సమర్పించారు.