
“రూట” రాష్ట్ర ప్రధాన సలహాదారులు గా డాక్టర్ ఎన్. అయ్యుబ్ హుస్సేన్
విజయవాడ (పల్లెవెలుగు) 21 ఆగష్టు: రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన సలహాదారులుగా కర్నూలు జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ సీనియర్ ఆచార్యులు డాక్టర్ ఎన్. అయ్యుబ్ హుస్సేన్ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. వీరిని ఎంపిక చేస్తూ “రూట” రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అబ్దుల్ వారిస్ మరియు సయ్యద్ ఇక్బాల్ లు శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా “రుట” వ్యవస్థాపక అధ్యక్షులు హిదాయతుల్ల మాట్లాడుతూ డాక్టర్ ఎన్ .అయ్యుబ్ హుస్సేన్ కర్నూలు జిల్లా తాండ్రపాడు లోని జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ లో గత రెండు దశాబ్దాలుగా సీనియర్ లెక్చరర్ గా సేవలందిస్తున్నారని , వీరి వద్ద శిక్షణ పొందిన దాదాపు వెయ్యి మంది విద్యార్థులు వివిధ జిల్లాల్లో ఉర్దూ ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈయన సమైక్యాంధ్ర మరియు నవ్యంద్రలో రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ అధికారిగా, రాష్ట్ర ఉర్దూ కోఆర్డినేటర్ గా దాదాపు ఒక దశాబ్ద కాలం పని చేసారని వారి కాలం లోనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దశాబ్దాల నుండి మారని ఉర్దూ మాధ్యమ పాఠ్యపుస్తకాలు (ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు) నవనీకరించి నూతన ఒరవడి సృష్టించారని కొనియాడారు. రాష్ట్రంలో మదరస వ్యవస్థను పటిష్ట పరచడంలో వీరి సేవలు మరువలేనివి, అమెరికాలో జరిగిన ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ లో భారతదేశం తరఫున హాజరైన ఏకైక వ్యక్తిగా అయ్యూబ్ హుస్సేన్ ఘనత సాధించారన్నారు . వారి సేవలను, గుర్తించిన ప్రభుత్వం ఆయనకు అనేక అవార్డుల తో సత్కరించిందని గుర్తు చేశారు .ఆయన సేవలు, ప్రతిభను గుర్తించి రూటా రాష్ట్ర ప్రధాన సలహాదారులుగా వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని “రూట” రాష్ట్ర నాయకత్వం తెలిపింది. డాక్టర్ అయ్యూబ్ హుస్సేన్ ఎన్నిక తో “రుట” సంఘం రాష్ట్రంలో బలమైన సంఘంగా ఎదుగుతుందని , ఆయన సేవలు, సలహాలతో సంఘ బలోపేతానికి కృషి చేస్తామని, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అబ్దుల్ వారిస్, సయ్యద్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అయ్యూబ్ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ మాధ్యమ విద్య ను పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పటిష్టపరిచేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తామని , ఉపముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ గారి సహాకారాలతో , ‘రూట’ రాష్ట్ర నాయకత్వ సారధ్యంలో కృషి చేస్తానని, తనను ప్రధాన సలహాదారుడు గా ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన సలహాదారులుగా ఎన్నికైన అయ్యూబ్ హుస్సేన్ కు రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రీజనల్ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.