Dharmavaram

జగనన్న కాలనీల్లో అమ్మకాల జోరు

  • ధర్మవరం జగనన్న కాలనీల్లో అమ్మకాల జోరు
  • ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్ని అమ్ముకుంటున్న లబ్ధిదారులు
  • రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పోతులనాగేపల్లి వైపు
  • జీవో నం:314 ప్రకారం 10 ఏళ్ళు అమ్మడానికి వీల్లేదు
  • లబ్ధిదారుల బలహీనతే..రియల్టర్ల బలం
  • ఇప్పటికే చాలామంది చేతులు మారిన ప్రభుత్వమిచ్చిన ఇంటిస్థలాలు
  • ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి పేదలకు స్థలాలిస్తే…అమ్ముకోవడం ఎంతవరకు సబబు?
  • అధికారులు దృష్టి సారించి విచారణ చేపడితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి
  • జగనన్న ఆశయానికి తూట్లు పొడుస్తున్న రియల్టర్లు
  • రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా, అత్యధికంగా ధర్మవరం పట్టణానికి ఇంటిస్థలాలను కేటాయింపజేసుకోవడంలో  ఎమ్మెల్యే కేతిరెడ్డి  సక్సెస్

ధర్మవరం,ఏప్రిల్ 08 (పల్లెవెలుగు): జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలన్న మంచి సదుద్దేశ్యంతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి కొట్లాదిరూపాయలు పెట్టి స్థలసేకరణ చేసి నిజమైన,అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి స్థలాలను కేటాయించి,కట్టుకోడానికి లోన్లు ఇస్తుంటే. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను లబ్ధిదారులు కొంతమంది తమ ఆర్థిక పరమైన, లేదా ఇతరత్రా సమస్యల సాకుతో ప్రభుత్వమిచ్చిన ఇల్లాస్థలాలను అమ్ముకుంటున్నారు, అమ్ముకున్నారు. ధర్మవరం పట్టణంలో పట్టణానికి మూడువైపులా జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇంటిస్థలాలను కేటాయించడం జరిగింది. కుణుతూరు, రేగాటిపల్లి, పోతులనాగేపల్లి ఈ మూడుచోట్ల భూముల్ని ప్రభుత్వం కొని పేదలకు అందించింది. అయితే ఈ మూడు చోట్లలో పోతులనాగేపల్లి వద్ద ఇచ్చిన భూములు పుట్టపర్తి రోడ్డుకు ఇరువైపులా ఉండడం వల్ల అందరి దృష్టి ఈ పోతులనాగేపల్లి ఇళ్లస్థలాలపైనే పడింది. ఇటు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, చోటా-మోటా నాయకులు లబ్ధిదారులను ప్రలోభాలకు గురిచేసి చాలావరకు ఇళ్లస్థలాలను కొన్నట్లు సమాచారం. ఇప్పుడు సత్యసాయి జిల్లా ఏర్పడడంతో పోతులనాగేపల్లి ప్రభుత్వమిచ్చిన స్థలాలకు రెక్కలొచ్చాయి. ఇలా లబ్ధిదారులు తమకు ప్రభుత్వమిచ్చిన ఇళ్ల స్థలాలను అమ్మడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా ఇదో ఆచారం అయిపోయిందని చెప్పినా తప్పుకాదేమో? ఎందుకంటే..1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు ఇచ్చినప్పుడూ ఇలాగే అమ్మేసుకొని తిరిగి 2004లో వైఎస్. రాజశేఖరెడ్డి  హయాంలో ఇచ్చిన ఇళ్లస్థలాలు కూడా ఇలానే అమ్మేసుకున్న ప్రబుద్ధులూ వున్నారు. ఇప్పుడు జగనన్న హయాంలో కూడా ఇదే కథ.  ప్రభుత్వం ఇవ్వడం-లబ్దిదారుడు అమ్మడం-తిరిగి ఇంటిస్థలం కోసం దరఖాస్తు చేయడం ఇదొక చక్రంలాగా తిరుగుతూనే ఉంది. తిరుగుతూనే ఉంటుంది. దీనికి పరిష్కారం లేదా? ప్రభుత్వాలు ఇంటిస్థలాలను ఇచ్చుకుంటూ పోవడం, లబ్ధిదారులు అమ్ముకుంటూ పోవడం దీనికి పరిష్కారం ఏంటి? ఇలా ఎంతకాలం? ఇప్పటికైనా అధికారులు విచారణ జరిపి జగనన్న కాలనీల్లో ఇళ్లస్థలాలు అమ్మిన  లబ్ధిదారులను గుర్తించి తగుచర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కొన్న వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ఆశయం, లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button