Dharmavaram

రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

ధర్మవరం,(పల్లెవెలుగు) 27 ఫిబ్రవరి: ఈ నెల 21న పట్టణంలోని కేతిరెడ్డి కాలనీ ఎల్.4 లో హత్యకు గురైన హరిప్రసాద్. హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ సీఐ కరుణాకర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని నిందితులను పట్టుకొనేందుకు గాలిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. పట్టణ సీఐ ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆదివారం ఉదయం పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద  పొలా కళ్యాణ మండపం వద్ద నిందితులున్నారన్న పక్కా సమాచారం అందడంతో  హరిప్రసాద్ ను హత్యచేసిన సయ్యద్ షేక్షావలి, దూదేకుల మస్తాన్ వలి, మల్లెల మల్లేసులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నిందితులు ముగ్గురూ పట్టణానికి చెందిన కేతిరెడ్డి కాలనీ L4 నివాసితులేననీ, గతంలో హతునికీ వీరికి  మధ్య గొడవలు, పాత కక్షల నేపథ్యంలో హరిప్రసాద్ ను హత్యచేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. గతంలో హతుడు హరిప్రసాద్  ఫిర్యాదు మేరకు దూదేకుల మస్తాన్ వలి మరో ముగ్గురిపై క్రైమ్ నం 480/2021నమోదు చేయడం జరిగినదన్నారు. అలాగే  దూదేకుల మస్తాన్ వలి ఫిర్యాదు మేరకు హతుడు హరిప్రసాద్, అతని స్నేహితుడు  ఉమాపతి, మరదలు మల్లీశ్వరి పై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. పరస్పర కేసులు నమోదైనప్పటినుండీ ఒకరినొకరు ద్వేషించుకోవడం, దూషించుకోవడం జరుగుతోందనీ ఈ నేపథ్యంలో వీరిని బైండోవర్ చేయడం కూడా జరిగిందని అన్నారు. ఈ నెల 21న తాగిన మైకంలో హతుడు హరిప్రసాద్ నిందితులను దూషించడంతో పరస్పర గొడవలో నిందితులు ముగ్గురూ బండరాయితో మోది హత్య చేశారన్నారు. హతుడు హరిప్రసాద్ పై కొత్త చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మర్డర్ కేసులు, ధర్మవరం అర్బన్ స్టేషన్లో  పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా వున్నదని, అదేవిధంగా హతునిపై రౌడీషీట్( నెం:677) ఉందని తెలిపారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసును త్వరితగతిన ఛేదించి నిందితుల్ని పట్టుకొన్న పట్టణ సీఐ కరుణాకర్, హెడ్ కానిస్టేబుల్ జాకీర్, కానిస్టేబుళ్లు మధుసూదన్, రాజన్న, నరసింహులు, ఉమా శంకర్ లను డీఎస్పీ రమాకాంత్ అభినందించారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button