
నిరుపయోగంగా ‘అన్నా క్యాంటీన్’
మందుబాబులకు అడ్డాగా,బహిర్భూమికి నిలయంగా ‘అన్నా క్యాంటీన్’
ధర్మవరం (పల్లెవెలుగు) 16 నవంబర్ : ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న ‘అన్నా క్యాంటీన్’ భవనం నిరుపయోగంగా పడి ఉండడంతో ప్రజలు మల, మూత్ర విసర్జనలు చేయడం, అదేవిధంగా మందుబాబులకు అడ్డాగా మారి కంపు కొడుతూ మద్యం బాటిళ్ళతో, మలమూత్రాలతో నిండిపోయి సకల రోగాలకు నిలయంగా మారిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో రూ.38 లక్షల ప్రజాధనం వెచ్చించి గత ప్రభుత్వం నిర్మించిన ఈ అన్నా క్యాంటీన్ నేడు దుర్గంధానికి నిలయం కావడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రెండు అన్నా క్యాంటీన్లు నిర్మించారు అందులో ఒకటి మునిసిపాలిటీ పన్నుల చెల్లింపు కేంద్రంగా మార్చి సద్వినియోగం చేశారు.ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న అన్నా క్యాంటీన్ కూడా వెంటనే శుభ్రపరచి సద్వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
సులబ్ కాంప్లెక్స్‌లు ఉన్నా.. పట్టణంలో ఎక్కడపడితే అక్కడ మాలమూత్ర విసర్జన
ధర్మవరం పట్టణంలో సులభ్ కాంప్లెక్స్ లు వున్నా కూడా బహిరంగంగా మల మూత్ర విసర్జన యథేచ్ఛగా చేస్తున్నారు.దీనివల్ల రోగాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.అందులోనూ ఇప్పుడు వర్షాకాలం సీజనల్ వ్యాధులతోపాటు ఇలాంటి బహిరంగ మూత్రవిసర్జన ద్వారా వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉంది.కాబట్టి మునిసిపల్,పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ బహిరంగ మూత్రవిసర్జన చేసే వారిపై కఠిన వైఖరి అవలంబించి,అవసరమైతే చట్టప్రకారం జరిమానాలు విధించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అన్నా క్యాంటీన్ ను ‘సచివాలయం గా ఉపయోగిస్తాం-మునిసిపల్ కమీషనర్ మల్లికార్జున
అన్నా క్యాంటీన్ నిరూపయోగంపై ‘పల్లెవెలుగు’ వివరణ కోరగా బ్రహ్మణవీధికి సంబంధించిన సచివాలయంగా అన్నా క్యాంటీన్ ను ఉపయోగించాలని నిర్ణయించామని,త్వరలోనే మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకువస్తామని మునిసిపల్ కమీషనర్ వెల్లడించారు.