Dharmavaram

మెడికల్ షాపుల నిబంధనలు బేఖాతర్

 • జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
 • డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ?
 • నెలవారీ అందుతున్న మామూళ్ల మత్తులో పడకేసిన పర్యవేక్షణ,తనిఖీలంటూ పెద్దఎత్తున ఆరోపణలు
 • ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ షాపు నిర్వాహకులు
 • తనిఖీలు,పర్యవేక్షణ రికార్డుల్లో మాత్రమే పరిమితం
 • నామ్ కే వాస్తే…తూ..తూ.. మంత్రంగా చర్యలు

మెడికల్ షాపుల బాగోతం పై ‘పల్లెవెలుగు’ప్రత్యేక కథనం

‘మీకు కడుపునొప్పి వస్తోందా…తల తిరగి పోతుందా… నిద్రపట్టడం లేదా.. మత్తుగా ఉండే మందు కావాలా… ఆ మందులు తెచ్చుకునేదెలా అని ఆందోళన చెందుతున్నా రా..? అందుకు మీరేం హైరానా పడాల్సిన పనిలేదు. మీకు ఏ మందులు కావాలంటే ఆ మందులు ఇట్టే ధర్మవరం మెడికల్‌ దుకాణాల్లో దొరుకుతాయి. డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకపోయి నా సరే మీకు అవసరమైన మందులను ఇచ్చేస్తున్నారు. పైగా మీకున్న సమస్యను మెడికల్‌ దుకాణం సిబ్బందికి చెబితే చాలు ఏ మందులు వేసుకోవాలో, రోజుకు ఎన్ని వేసుకోవాలో కూడా వారే చెప్పేస్తారు. ఈ విధానం ధర్మవరం పట్టణంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా కొన్ని మెడికల్‌ దుకాణాల్లో యథేచ్చగా సాగుతోంది.

ఏ సిరప్ కావాలన్నా

మాదక ద్రవ్యాలు వినియోగించేవారు వాటికి బదులుగా కొన్ని రకాల సిరప్‌లను వాడుతున్నారు. ఇవి మెడికల్‌ దుకాణాల్లో లభిస్తాయి. కొరెక్స్‌, పెన్సిడ్రిల్‌ వంటి మందుల్లో కొంత మత్తు ప్రభావం ఉంటుంది. మాదక ద్రవ్యాలు దొరకని సమయంలో వాటికి బానిసైనవారు ఈ సిరప్‌లను వినియోగిస్తుంటారు. ఈ తరహా సిరప్‌లను డాక్టర్‌ రాసి ఇస్తేనే సదరు రోగికి ఇవ్వాలి. అయితే, మెడికల్‌ షాపుల నిర్వాహకులు ఇవేవీ పట్టించు కోకుండా మందులు ఇచ్చేస్తున్నారు. మెడికల్‌ దుకాణాల్లో నిషేధిత డ్రగ్స్‌, కాలపరిమితి దాటిన మందులు, నకిలీ మందుల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. రోగి అడిగిన మందు లేకపోతే దానికి బదులుగా మరో కంపెనీకి చెందిన మందులను మెడికల్ షాపు నిర్వాహకులు అంటగడుతున్నారు.

డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే అమ్మకాలు

నిజానికి ఏ మందులకైనా డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ ఇస్తేనే మెడికల్‌ షాపుల నిర్వాహకులు మందులను ఇవ్వాలి. ఈ నిబంధనను ధర్మవరం పట్టణంలోని ఏ ఒక్క మెడికల్‌ షాపు నిర్వాహకుడు పాటిస్తున్న దాఖలాలు లేవు. రోగి కానీ, అతని తాలుకు వ్యక్తిగాని వచ్చి ఫలానా మందులు కావాలంటే ప్రిస్ర్కిప్షన్‌ లేకున్నా ఇచ్చేస్తున్నారు. రోగి తాను వాడిన టాబ్లెట్స్ ఖాళీ పట్టా చూపించినా కూడా మందులు ఇచ్చేస్తున్న మెడికల్ షాపు నిర్వాహకులు.ముఖ్యంగా కార్డియాలజీ, సైకియాట్రి, న్యూరాలజీ, బ్రెయిన్‌ స్ట్రోక్‌, అబా ర్షన్‌, డయోబెటిక్‌, బీపీ, స్లీపింగ్‌, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ తదితర రకాల మందులను డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వకూడదు. ఇందులో హైడోస్‌, లో డోస్‌ ఉంటాయి. రోగ తీవ్రత, వయసును బట్టి డాక్టర్లు డోసులను నిర్ణయిస్తారు. ప్రిస్ర్కిప్షన్‌పై డాక్టర్‌ ఎన్ని మందులు రాశారో ఆ మేరకే ఇవ్వాలి. ఆ తర్వాత రోగి మరోసారి వచ్చి వాటిని కావాలని అడిగితే ఇవ్వకూడదు.

ఫార్మసిస్టులు ఎక్కడ?

‘డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ – 1940’ ప్రకారం ప్రతి మెడికల్‌ షాపులో రిజిస్టర్‌ ఫార్మసిస్టు ఉండాలి. బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ పూర్తి చేసిన వారు, రిజిస్టర్‌ చేసుకున్న వారు మాత్రమే మెడికల్‌ దుకాణాలను నిర్వహించాలి. మెడికల్‌ దుకాణాలకు అనుమతి ఇచ్చే సమయంలో ఔషధ నియంత్రణ అధికారులు ఫార్మసిస్టు ఉంది, లేనిదీ పరిశీలించిన తర్వాతే సదరు మెడికల్‌ దుకాణానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత ఏరియా ఇన్‌స్పెక్టర్లు కూడా తనిఖీలు చేసిన సమయంలో ఫార్మసిస్టు ఉన్నారా…? లేదా…? అని పరిశీలించాల్సి ఉంటుంది.

70 శాతా నికి పైగా మెడికల్‌ షాపులు నిబంధనలు బేఖాతర్‌ చేస్తున్నాయి. మందుల దుకాణంలో ఉండే ఫార్మాసిస్టు పేరు, అర్హత పత్రం, జిరాక్స్ కాపీ ఇతర వివరాలు విని యోగదారులకు కన్పించేలా ఉంచాలి. 70 శాతం దుకాణాల్లో ఇది అమలు కావడం లేదు. దుమ్ము, ధూళి ఔషధ దుకాణాల్లో ప్రవేశించకుండా పట్టాలను ఏర్పాటు చేయాలి. కానీ కొన్ని దుకాణాల్లో మాత్రమే వీటిని పాటిస్తున్నారు. ఎక్కువ శాతం వీటిని పాటించడం లేదు. వాస్తవానికి షాపు పెట్టిన తర్వాత కూడా ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు మాత్రమే మందులను అమ్మాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో,అదేవిధంగా ధర్మవరంలో మెజార్టీ మెడికల్‌ షాపులు ఇందుకు విరుద్ధంగా నడుస్తున్నాయి. అనుమతులు ఒకరి పేరుపై తీసుకొని మరొకరు నిర్వహిస్తున్నారు. షాపుల్లో మాత్రం కేవలం సర్టిఫికెట్‌ మాత్రమే కన్పిస్తుంది తప్ప ఆ వ్యక్తి కన్పించడు. బి-ఫార్మాసి చదివిన వారి సర్టిఫికెట్‌ను అద్దెకు తీసుకుని దుకా ణాన్ని ఏర్పాటు చేసి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్క దుకాణంలోనూ ఫార్మాసిస్టు అందుబాటులో ఉండడం లేదు. ఎవరైనా తనిఖీలకు వచ్చిన ప్పుడు వారిని పిలిపించి ఆయా సీట్లలో కూర్చోబెడుతున్నారు. ఏడాదికి ఇంతా అని నిర్వాహకులు ఫార్మసీ సర్టిఫికెట్‌ ఇచ్చిన వ్యక్తికి ముట్ట చెప్తున్నారు.

ఐదేళ్లకోసారి సర్టిఫికెట్‌ను రెన్యూవల్‌ చేయాల్సి ఉన్నా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమేనన్న తనిఖీలు చేసేవారు కరువయ్యారు. కొందరైతే కిరాణ దుకాణాల తరహాలో గ్రామాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు.

ప్రజారోగ్యంతో చెలగాటం

ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు మాత్రమే మందులను ఇవ్వాలి అయితే చాలా మంది తమ మెడికల్ షాపుల్లో టెన్త్‌, ఇంటర్‌ చదివిన వారిని తక్కువ వేతనాలతో పనిలో కుదుర్చుకుంటున్నారు. కొందరు నిర్వాహకులతో పాటు పని చేసే వారు కూడా డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్‌ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కనీస విద్యార్హత లేని వ్యక్తులు మందులు విక్రయిస్తున్నారు. ఒక్కోసారి ఏం రాస్తారో తెలియక ఒక మందుకు బదులు మరో మందులిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణ లూ వివనిపిస్తున్నాయి. హాస్సిటల్స్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసి తమ దుకాణాల్లోనే లభించేటటువంటి కంపెనీల మందులను అమ్ముతున్నారు. ఇందుకోసం కొందరు వైద్యులతోనూ ఒప్పందాలు కుదుర్చు కుంటున్నారు. మొత్తంగా రోగుల నుండి అడ్డగోలుగా దండుకుంటూ లక్షలు గడిస్తున్నారు. ప్రతియేటా వ్యాపారం కోట్లల్లో జరుగుతుంది.ధనార్జనే ధ్యేయంగా మెడికల్‌ షాపులు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

విక్రయించే వాటికి రశీదులేవి?

మందుల దుకాణంలో విక్రయించే వాటికి రశీదులు ఇవ్వాల్సి ఉండగా యాజమానులు వాటిని ఇవ్వడం లేదు. తప్పనిసరిగా మందుల దుకాణంలో కొనుగోలు చేసిన ప్రతి దానికి విధిగా వినియోగదారులకు రశీదులు ఇవ్వాలి. ఔషధం పేరు, బ్యాచ్ నెంబరు, తయారు చేసిన సంస్థ పేరు, తయారు తేదీ, గడువు తేదీ, ధర, ఆ రశీదులో స్పష్టంగా ఉండాలి. కానీ ఇవేమీ ఉండడం లేదు. అధిక ధరలకు విక్రయించినా, మందుల నాణ్యతపై అనుమానం వచ్చినా రశీదు అందుబాటులో ఉంటే అధికారులకు ఫిర్యాదు చేసి వాటిని పరీక్ష చేయించేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ దుకాణ యాజమానులు చాలా వరకు రశీదులు ఇవ్వకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గట్టిగా అడిగితే కానీ రశీదులు ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని దుకాణాల్లో గడువు ముగిసిన మందులను కూడా వినియోగదారులకు అంటగడుతున్నారు.

ఇవీ నిబంధనలు…

 • ఫార్మాసిస్ట్ ఉండాలి
 • డ్రెస్ కోడ్ పాటించాలి
 • డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా షెడ్యూల్‌ మందులను విక్రయించరాదు.
 • నాన్‌ షెడ్యూల్‌ మందులను కూడా రెండవ సారి ఇవ్వకూడదు.
 • ప్రిస్ర్కిప్షన్‌లో సూచించిన మేరకే మందులను ఇవ్వాలి.
 • డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌లో రాసిన మందులు కాకుండా ప్రత్యామ్నాయ మందులు ఇవ్వకూడదు.
 • మందులు ఇచ్చిన ప్రతిసారి మెడికల్‌ షాపు స్టాంప్‌ వేయాలి.
 • విక్రయించిన మందులను సూచిస్తూ తప్పని సరిగా బిల్లు ఇవ్వాలి.
 • ఎప్పటికప్పుడు మందుల అమ్మకాల వివరాలను రిజిస్టర్‌లో పొందు పరచాలి.
 • దుకాణంలో మందులను వరసగా పేర్చాలి.
 • గడవు దాటిన మందులకు విక్రయించ కూడదు.
 • ఫ్రిజ్‌లో మందుల నిల్వ సక్రమంగా ఉంచాలి.
 • మెడికల్‌ దుకాణాల్లో మందులను కలిపే ప్రయత్నాలు చేయకూడదు.
 • రోగికి వైద్య పరీక్షలు చేసి మందులను ఇచ్చే విధానం అవలంబించకూడదు.
 • మెడికల్‌ షాపుల్లో రోగులకు ఇంజెక్షన్‌ చేయకూడదు.

ఔషధ నియంత్రణ అధికారులకు పెద్ద ఎత్తున ‘మామూళ్లు’?

జిల్లా వ్యాప్తంగా ప్రతి మెడికల్ షాపు నిర్వాహకులనుండీ నెల నెలా పెద్దఎత్తున ‘మామూళ్లు’ అందుతున్నాయని, అదేవిధంగా ధర్మవరం పట్టణంలో ఒక్కో మెడికల్ షాపు నుండీ ఇదివరకు 6వందలు ప్రతినెలా మామూళ్లు అందిస్తున్నట్టు, ఇప్పుడు ఒక్కో షాపుకూ 1వెయ్యి రూపాయలు ‘మామూళ్లు’ అందిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.అందువల్లనే ధర్మవరం పట్టణ మెడికల్ షాపులపై ఏరియా డ్రగ్ ఇన్ స్పెక్టర్ ఎలాంటి పర్యవేక్షణ, తనిఖీలు, చర్యలు  చేపట్టరని ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

 • ప్రమాదంలో ప్రజారోగ్యం
 • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

ఇప్పటికైనా కళ్ళు తెరిచేరా?

జిల్లా వ్యాప్తంగా,అదేవిధంగా ధర్మవరం పట్టణంలో మెడికల్ షాపులు నిబంధనలు పాటించకుండా ఫార్మాసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఔషధ దుకాణ దందాను నియంత్రించాల్సిన అధికారులే చూసి చూడనట్లుగా వ్యవహరించడానికి కారణం నెల నెలా లక్షల్లో అందుతున్న ‘మామూళ్లే’ కారణమంటూ ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి.ఇప్పటికైనా రాష్ట్ర ఔషధ నియంత్రణా అథారిటీ అధికారులు జిల్లాలో,అదేవిధంగా ధర్మవరంలో జరుగుతున్న మెడి’కిల్’దందా ను అరికట్టడమే కాకుండా,ప్రజల్లో బహిరంగంగా వినిపిస్తోన్న ‘నెలవారీ మామూళ్లపై’,కనీస పర్యవేక్షణ,తనిఖీలు చేపట్టకుండా కేవలం రికార్డుల్లో మాత్రమే వాటిని చూపిస్తూ,తూతూమంత్రంగా.. మొక్కుబడి చర్యలు తీసుకుంటున్న ఏరియా డ్రగ్ ఇన్స్పెక్టర్లపై తగుచర్యలు చేపట్టాలని, ప్రజల ఆరోగ్యంపై చెలగాటం ఆడుతూ నిబంధనలు పాటించని మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button