Dharmavaram

అక్రమ వడ్డీ  వ్యాపారుల ఆటకట్టిస్తా.. బాధితులకు అండగా ఉంటా -ఎమ్మెల్యే కేతిరెడ్డి

  • తక్షణమే అక్రమ వడ్డీ వ్యాపారం ఆపేయండి, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వడ్డీ వ్యాపారులకు హెచ్చరికలు
  • అధిక వడ్డీ చెల్లిస్తున్న బాధితులు ఇకపై డబ్బులు కట్టవద్దంటూ పిలుపు

ధర్మవరం (పల్లెవెలుగు) 02 సెప్టెంబర్: ధర్మవరం నియోజకవర్గంలో అధిక వడ్డీలు, అక్రమ వడ్డీలకు తావులేదని, అలా అక్రమ వడ్డీ వసూళ్లకు పాల్పడేవారు ఎంతటివారైనా వదలిపెట్టే ప్రసక్తే  లేదంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారంటూ తనకు ప్రజలనుండీ ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అక్రమ, అధిక వడ్డీలు వసూలు చట్టరీత్యా నేరమని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యే గా వున్నప్పుడు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మహిళలను గ్రూపులుగా ఏర్పరచి అధిక వడ్డీలు వసూలు చేసి ప్రజలను పీడిస్తున్న పరిస్థితుల్లో  వారిపై కఠిన చర్యలు చేపట్టి  వారిని తరిమివేయడం జరిగిందన్నారు. ఎన్నో బాధిత కుటుంబాలను మైక్రోఫైనాన్స్ బారినుండీ కాపాడ్డం జరిగిందన్నారు.

ధర్మవరం నియోజకవర్గంలో ఎలాంటి అక్రమ వడ్డీ వసూలు చేస్తే సహించే ప్రసక్తి లేదని, అక్రమ వడ్డీ వ్యాపారులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవలన్నారు. చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, తోపుడు బండి, దినసరి కూలీలే లక్ష్యంగా వారి అవసరాల బలహీనతను అసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారస్తులు పట్టి పీడిస్తున్నారన్నారు. ఎవరైతే అక్రమ, అధిక వడ్డీ బాధితులు ఉన్నారో వారు ఇకపై ఎలాంటి డబ్బూ చెల్లించవద్దనీ, వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు కట్టమని బలవంతం చేసినా, బెదిరించినా, భయపెట్టినా వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, లేదా 100 కు డయల్ చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తమ కార్యాలయానికి  ఫోన్ చేయాలని సూచించారు. ప్రజలు అధిక వడ్డీలకు అప్పులు చేయవద్దని హితవుపలికారు.

అనంతరం అర్బన్ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ ఎవరైనా అధిక వడ్డీ వసూలు చేస్తున్నట్టైతే తమకు దృష్టికి తీసుకొని రావాలని, బాధితులు ఫిర్యాదు చేయాలని, అలాంటి వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. పట్టణంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారి సమాచారం తమకు అందించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. 94407 96831 గల  ఫోన్ నెంబరుకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ఉడుముల రాము, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button