
సంక్షేమ పథకాల అమలులో అవినీతి జరగకూడదు – ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ధర్మవరం (పల్లెవెలుగు) ఆగస్టు 25 ఏపి ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్య సాధన కోసం సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారని తద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందేవిధంగా వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని, అమలుతీరులో అవినీతి జరిగితే సహించేది లేదని, సస్పెండు వేటుతో పాటు క్రిమినల్ కేసును కూడా నమోదు చేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఛైర్మెన్ లింగం నిర్మల, వైస్ చైర్మెన్లు చందమూరి నారాయణరెడ్డి మాసపల్లి సాయికుమార్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి స్వగృహములో 40 వార్డుల కౌన్సిలర్లతో కలిసి విలేఖరుల సమావేశమును ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటిదాకా నియోజక వర్గములోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి ముదిగుబ్బ మండలాలలో అవినీతి ఆరోపణలు ఉన్న 267 మంది వార్డు వాలంటీర్లను విధుల నుండి తొలగించడము జరిగిందన్నారు. అదేవిధంగా ఇటీవల నేతన్నవేస్తం వధకంలో కూడా వాలంటీర్లు సువర్ణ, లక్ష్మి, సతీష్, లోకేల్లను కూడా విధులను తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. వార్డు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు పారదర్శకతతో చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ప్రజల నుండి మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కౌన్సిలర్లు అందరూ కూడా వార్డు వాలంటరీ పై, సచివాలయ ఉద్యోగులపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయములో కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులతో నేరుగా సమాచారం తీసుకోవడం జరుగుతోందన్నారు. అవినీతికి తావు ఇవ్వకుండా మంచి పేరు తెచ్చుకొనేలా నడుచుకోవాలన్నారు. అవినీతి విషయములో కౌన్సిలర్లను అధికారులను ఉపేక్షించేది లేదని తెలిపారు. లంచం అడిగితే కాల్ సెంటర్కు ఫిర్యాదు చేయాలన్నారు.. అర్హత ఉన్న పేదలందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందించే బాధ్యత అధికారులదేనని తెలిపారు. ఈ కార్యక్రమములో 40 వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.