
రెండేళ్లుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న “ఆ నలుగురు”
- కరోనా మొదటి,రెండవ వేవ్ లో ప్రాణాలకు తెగించి క్వారంటైన్ లో విధులు
- పనిచేయించుకొన్నారు జీతాలు ఇవ్వడం మరిచారు
- ఇప్పటికైనా ప్రభుత్వం,అధికారులు స్పందించేరా?
ధర్మవరం,ఆగస్టు 23;(పల్లెవెలుగు): కరోనా విళయతాండవం చేస్తున్న వేళ.. ప్రజలు,అధికారులు,డాక్టర్లు ఈ మహమ్మారికి వణికిపోతున్నవేళ..మనిషికి మనిషి దూరం పాటిస్తున్న వేళ… కరోనా రోగులను చూడ్డానికి కూడా భయభ్రాంతుల గురవుతున్న వేళలో..ప్రభుత్వం ధర్మవరం పట్టణంలో కూడా క్వారంటైన్ సెంటర్ స్థానిక ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో ఏర్పాటు చేశారు.
అందులో పారిశుధ్య పనులు చేయడానికి రెవెన్యూ అధికారులు,మునిసిపల్ శాఖాధికారుల ద్వారా ‘నలుగురుని’ నియమించారు.
కరోనా రోగుల మధ్య క్వారంటైన్ లో పని చేయడం ప్రాణాలతో చెలాగాటమే.. అయినా ‘ఆ నలుగురు’ప్రభుత్వం నిర్దేశించిన పారిశుధ్య పనులు, బెడ్లు మార్చడం దగ్గరనుండీ టాయిలెట్లు శుభ్రపరచడం వరకూ అన్నిపనులూ చేస్తూ వచ్చారు.
కరోనా మొదటి దశ, రెండో దశలో కూడా నిర్విఘ్నంగా తమ విధులు నెరవేర్చారు.
ఇప్పటికీ అందని జీతాలు ప్రభుత్వం ,అధికారులు కరోనా వేళ కఠినమైన పరిస్థితుల్లో ‘ఆ నలుగురు ‘ చేత పనులు చేయించుకున్నారు. ప్రాణాలకు తెగించి పనిచేసిన ‘ఆ నలుగురు’కి రెండేళ్లుగా జీతాలు ఇవ్వలేదు.వీరి కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? వీరు తమ భార్యాపిల్లల్ని ఎలా పోషించుకోవాలి?
జీతాలకోసం ప్రభుత్వానికి పంపించాం అంటూ చేతులు దులుపుకున్న రెవెన్యు అధికారులు
‘ఆ నలుగురు’ జీతాల కోసం ప్రభుత్వానికి లెటర్ పెట్టినట్టు,త్వరలో వస్తాయని చెబుతున్నారు కానీ ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి ఇంకెప్పుడొస్తాయో అంటూ ‘ఆ నలుగురు’ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ, అధికారులు త్వరితగతిన ‘ఆ నలుగురికీ’ జీతాలు వచ్చే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.