markapuramGouse Basha

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఆరోగ్యానికి ఉపాధ్యాయులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి – కలెక్టర్ ప్రవీణ్ కుమార్

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఆరోగ్యానికి ఉపాధ్యాయులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి – కలెక్టర్ ప్రవీణ్ కుమార్

మార్కాపురం (పల్లెవెలుగు) 05 జనవరి:  పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఆరోగ్యానికి ఉపాధ్యాయులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలను, విద్యార్థుల హాజరును పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో ముళ్ళ చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడుకి సూచించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విషయంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారం తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు వారికి మేనేజ్మెంట్ ఫండ్ నుంచి నిధులు చెల్లించాలని చెప్పారు. పాఠశాలకు ప్రభుత్వం గ్యాస్ స్టౌ మంజూరు చేసినా కట్టెల పొయ్యితో వంట చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ స్టౌకు అవసరమైన మరమ్మతులు తక్షణమే చేయించాలని ఆదేశించారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పైనా అవగాహన కలిగించాలని ఆయన చెప్పారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం ఆహార పదార్థాలను విద్యార్థులకు సమకూర్చాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. పాఠశాలలో డ్రాపౌట్స్ లేకుండా ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.  ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకంలో అందించిన యూనిఫారాలు, బూట్లు క్రమం తప్పకుండా విద్యార్థులు ధరించేలా  చూడాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు కరోనా నివారణ వాక్సినేషన్ పై కలెక్టర్ ఆరా తీశారు. తమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ జె.వి.మురళి ( రెవిన్యూ మరియు రైతు భరోసా), మార్కాపురం ఆర్డీవో లక్ష్మి శివజ్యోతి, స్థానిక తాసిల్దార్ ఎలీషా,  ఎంఈఓ రామదాసు నాయక్, సర్పంచ్ గౌతమి తదితరులు ఉన్నారు.

Back to top button