
యువతకు ఆదర్శం.. షేక్ రషీద్
యువతకు ఆదర్శం.. షేక్ రషీద్
- నరసరావుపేట నియోజకవర్గం నుండి జాతీయ అండర్ –19 క్రికెట్ జట్టుకు ఎంపిక అయ్యి ఖ్యాతి సాధించిన వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌కు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రత్యేక అభినందనలు
- జట్టు విజయ కేతనంలో ప్రధాన భూమిక పోషించడం గర్వకారణం
- విజ్ఞాన్ సంస్థల నుండి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి
- నరసరావుపేట వేదికగా ఘనంగా సన్మానం నిర్వాహిస్తాం– ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
నరసరావుపేట (పల్లెవెలుగు) 08 ఫెబ్రవరి: అత్యంత సామాన్య వ్యవసాయ కుటుంబం నుండి పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇండియా అండర్–19 క్రికెట్ టీమ్ వైస్‌కెప్టెన్ షేక్ రషీద్ ను నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నరసరావుపేట నియోజకవర్గం నుండి ప్రపంచ స్థాయిలో రషీద్ ఖ్యాతి సాధించడం గర్వంగా ఉందని, పేదరిక ప్రతిభకు అడ్డంకి కాదని.. నిర్ధిష్ట లక్ష్యం, పట్టుదల, మక్కువ, శ్రమ ఉంటే సాధించలేనిది ఏమి ఉండదని షేక్ రషీద్ నిరూపించాడని, ఇతను యువతకు ఆదర్శంగా నిలిచాడని ఎంపీ కొనియాడారు. ఇండియా యూ–19క్రికెట్ టీం నేడు వరల్డ్ కప్ సాధించిచటంలో ప్రధాన పాత్ర పోషించాడని, కీలకమైన సెమీ ఫైనల్స్‌లో 94పరుగులు, ఫైనల్లో క్లిష్ట పరిస్థితుల్లో 50పరుగులు కొట్టి టీం ను విజయతీరాల వైపు నడిపించడం గర్వంగా ఉందన్నారు. ఏడేళ్ల వయస్సులోనే బ్యాట్ పట్టిన షేక్ రషీద్ ను చూసి.. అతనికి క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గుర్తించి రషీద్ తండ్రి ప్రోత్సహించాడని, వ్యవసాయ పనులు చేసుకుంటూ, ప్రైవేట్ బ్యాకింగ్‌లో లోన్స్ రివకరీ ఏజెంట్ గా జీవనం సాగిస్తున్న షేక్ రషీద్ తండ్రి బలిషావలి.. రషీద్‌కు ఎటువంటి లోటు చేయకుండా క్రికెట్లో రాణించేందుకు అండగా నిలబడటం గొప్పగా ఉందని, వారి తల్లిదండ్రులకు ఎంపీ ప్రశంసలు తెలియజేశారు.
విజ్ఞాన్ సంస్థల నుండి సహాయసహకారాలు అందిస్తాం
తన నియోజకవర్గమైన రషీద్ భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించేందుకు అండగా ఉంటామని, జాతీయ స్థాయి క్రికెట్ వరకు ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు విజ్ఞాన్ సంస్థల నుండి అందిస్థామని ఎంపీ అన్నారు.
నరసరావుపేట వేదికగా సన్మానం నిర్వహిస్తాం
నరసరావుపేట నుండి నేడు అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన రషీద్‌కు ఘనంగా సన్మానం ఏర్పాటు చేస్తామని, అతను ఇండియాకు తిరిగిరాగానే.. అతను సాధించిన ఘనతను తెలిపేలా.. అతని స్ఫూర్తిని యువత ఇనుమడింప చేసుకునేలా నరసరావుపేట వేదికగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని ఎంపీ వెల్లడించారు.
–షేక్ రషీద్ తల్లిదండ్రుల స్వస్థలం గుంటూరు జిల్లాలోని, ప్రత్తిపాడు మండలం, పాత మల్లాయ పాలెం. వృత్తి రిత్యా వీరు నరసరావుపేట నియోజకవర్గంలోని, రొంపిచర్ల మండలంలోని, బుచ్చిపాపన్న పాలెంలో స్థిర పడ్డారని, రషీద్ విద్యాభ్యాసం నరసరావుపేట పరిధిలోనే కొనసాగుతుందని వారి తల్లిదండ్రులు వివరించారు. ప్రస్తుతం రషీద్ నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ఇయర్ చదువుతున్నాడు.