NandyalAbdul Javid

నంద్యాలలో వైద్యకళాశాల ఏర్పాటు దిశగా ప్రభుత్వ నిర్ణయం నంద్యాల రైతాంగ, ప్రజల విజయం

నంద్యాలలో వైద్యకళాశాల ఏర్పాటు దిశగా ప్రభుత్వ నిర్ణయం నంద్యాల రైతాంగ, ప్రజల విజయం

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 27 జూన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16 వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికి కేవలం నాలుగు వైద్య కళాశాలకు మాత్రమే కేంద్ర వైద్య కౌన్సిల్ నుండి అనుమతులు పొందిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు. సోమవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల వైద్యకళాశాల ఏర్పాటు అనుమతులకై నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించ లేదనీ,  నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లోని 50 ఎకరాల భూమిని నంద్యాల వైద్యకళాశాల ఏర్పాటుకు బదిలిని వ్యతిరేకిస్తూ నంద్యాల  రైతాంగం  హైకోర్టులో కేసు వేయడం వలననే  ఐదవ వైద్య కళాశాలగా నంద్యాల వైద్య కళాశాల అనుమతికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. నంద్యాల వైద్య కళాశాల ఏర్పాటుకై కేంద్ర వైద్య సంస్థ అనుమతికై నివేదికలు సమర్పించనప్పటికీ, నంద్యాల వైద్య కళాశాల అనుమతి లభించిందని తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం న్యాయస్థానం ముందుంచిందని ఆయన అన్నారు. అంతేకాకుండా జూన్ 21 న జరిగిన హైకోర్టు వాదనలలో  నంద్యాల వైద్య కళాశాల అనుమతి కై కేంద్ర వైద్య కౌన్సిల్ కు దరకాస్తు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం తరుపు న్యాయవాది తెలిపారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో 2023 వ సంవత్సరం నుండి ప్రారంభించేలాగా కేవలం 5 వైద్యకళాశాల ఏర్పాటు కు సంబందించిన ఉద్యోగుల నియామకాలకు  కాబినెట్ లో అమోదం తెలిపారని దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.   రైతాంగం న్యాయస్ధానాన్ని ఆశ్రయించకుండా ఉండి ఉంటే  మిగిలిన 11 కళాశాలల జాబితాలో నంద్యాల వైద్య కళాశాల 12 వదిగా చేరి ఉండేదని, నంద్యాలకు ఇప్పటిలో వైద్యకళాశాల వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు..  నంద్యాల ప్రాంత రైతాంగం హైకోర్టు ను ఆశ్రయించిన సందర్భంలో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే  నంద్యాల వైద్యకళాశాల ఏర్పాటు దిశగా ప్రభుత్వ నిర్ణయం జరగడం,  ఈ ప్రాంత రైతాంగ మరియు ప్రజల విజయమని ఆయన తెలిపారు. రాష్ట్రం విభజన జరిగిన తరువాత 1800 ఎకరాలలో విస్తరించిన అచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం తెలంగాణా రాష్ట్రంలో ఉండిపోయిందని, ఈ సందర్భంలో పరిశోధన స్థానాలను అభివృద్ధి చేయడం, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ స్థాయి వ్యససాయ విశ్వ విద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం విస్మరించిందని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  అంతటితో ఆగకుండా నంద్యాల, అనకాపల్లి, మచీలిపట్నం లో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలను వైద్య కళాశాలలకు బదిలికి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసి వ్యవసాయ రంగ నిర్వీర్యానికి తెరలేపిందని ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో నంద్యాల ప్రాంత రైతాంగం న్యాయస్థానం తలుపులు తట్టకుండా ఉండి ఉంటే, నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్ధానానికి ఆయివుపట్టు లాంటి భూమి బదిలీ ఈ పాటికే  జరిగి ఉండేదనీ, ఈ భూమి బిల్డ్ ఏ పి లేదా అలాంటి మరో పథకం కింద ప్రభుత్వ అప్పులు తీర్చడానికి ఉపయోగపడేదేమోనని ఆయన అన్నారు.  ఏది ఏమైన నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం భూ బదిలీ అంశంపై  న్యాయస్థాన తీర్పుకంటే ముందే ప్రభుత్వం ముందుకు వచ్చి నంద్యాల వైద్యశాలకు ప్రక్కనే నిరుపయోగంగా  ఉన్న పాత మార్కెట్ యార్డ్  భూమిని  వైద్యకళాశాల ఏర్పాటుకు  బదిలీ చేయాలని కోరుకుంటున్నామని దశరథరామిరెడ్డి అన్నారు.   కేంద్ర వైద్య కౌన్సిల్ నిబంధనలు ప్రకారం వైద్యశాల, వైద్య కళాశాల ఏర్పాటుకు కావలసిన  20 ఎకరాల భూమి నంద్యాల వైద్యశాల, పాత మార్కెట్ యార్డ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. నిరుపయోగంగా ఉన్న మార్కెట్ యార్డు భూమిని , నంద్యాల పరిశోధన స్థానం భూమికి బదలుగా వైద్య  కళాశాలకు  కేటాయించి  వైద్య ,  వ్యవసాయ  రంగ అభివృద్ధికి   దోహదపడాలని దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, బెక్కం రామసుబ్బారెడ్డి, మురళీధర్ రెడ్డి, సంజీవరెడ్డి, బెక్కం చిన్న రామకృష్ణారెడ్డి, కొమ్మా శ్రీహరి, సాకేశ్వరరెడ్డి, పిట్టం ప్రతాపరెడ్డి, భాస్కర్ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి, సహదేవరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Back to top button