NandyalAbdul Javid

నూతన జూనియర్, డిగ్రీ కళాశాలలలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలి – రూట రాష్ట్ర కార్యదర్శి జమాన్

నూతన జూనియర్, డిగ్రీ కళాశాలలలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలి – రూట రాష్ట్ర కార్యదర్శి జమాన్

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 09 జూన్: రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించనున్న నూతన జూనియర్, డిగ్రీ కళాశాలలలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జమాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఉదయం స్థానిక రూట  కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జి కే కలీమ్ ముఖ్య నాయకులతో  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జమాన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వాలు పదుల సంఖ్యలో ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలలు స్థాపించి తరగతి గదులు నిర్మించి, కేవలం ప్రిన్సిపల్ పోస్ట్ మాత్రమే మంజూరు చేసి ఒక్క ఉర్దూ మీడియం జూనియర్ లెక్చరర్ పోస్టు కూడా మంజూరు చేయకుండా కాంట్రాక్ట్ , అతిథి  అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న జూనియర్ మరియు డిగ్రీ కళాశాల లో ఒక్కటి కూడా ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల లేకపోవడం శోచనీయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు జి కే కలీమ్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఉపాధ్యాయుల బదిలీల్లో మ్యానువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, గతం లో ఆన్ లైన్ కౌన్సిలింగ్ ద్వార ఎన్నో సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. సభకు హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగీర్ బాషా  మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా 220 ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలలకు 660 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేయకుండా ఆ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును అంధకారమయం చేస్తున్నదని ఇది ఎంతవరకు సమంజసమని , సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లు గా ప్రమోషన్ కల్పిస్తే ప్రభుత్వం పై ఏమాత్రం భారం పడదని సూచించారు. ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు కేవలం  ప్రకటనలతో కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. హెచ్. అన్సారీ, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అతావుర్ రహ్మాన్, మోమిన్ సైఫుల్లా, ఆర్థిక కార్యదర్శి ముల్లా మహబూబ్ బాషా,  జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి నయిముజ్జమాన్, కార్యదర్శి సి ఎం డి రఫీ, నంద్యాల రీజనల్ శాఖ అసోసియేట్ అధ్యక్షులు జాఫర్ హుసేన్, కార్యదర్శి అహ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button