
సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు అభినందనలు
సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు అభినందనలు
నంద్యాల 03 జూన్: సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించడం మన ఉమ్మడు కర్నూలు జిల్లాకే గర్వకారణమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి హర్షం వెలిబుచ్చారు. శుక్రవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ సివిల్స్ పరీక్షలో మన కర్నూలు జిల్లాకు చెందిన మహానంది మండలం నందిపల్లె గ్రామానికి చెందిన మనీషారెడ్డి, చాగలమర్రి మండలానికి చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి, కోవెలకుంట్ల కు చెందిన సుధీర్ కుమార్ రెడ్డి, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన అంబికాజైన్ లు సివిల్స్ లో ర్యాంకులు సాధించడం వీరంతా మన కర్నూలు జిల్లా వాసులు కావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. పిల్లల ఆలోచనలకు విలువనిచ్చి వారి ఆలోచనలకు అనుగుణంగా వారికి పూర్తి సహకారం, ప్రోత్సాహం అందిస్తే విద్యార్థులు ఏదైనా సాధిస్తారన్న విషయాన్ని ఈ నలుగురు నిరూపించారని ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. విద్యార్థులు తమలో వున్న ఆత్మన్యూనత, బలహీనతలను తొలగించుకుని మానసిక స్థైర్యంతో పట్టుదల, సహనం, ఏకాగ్రతతో చదివాలని ఒక్కోసారి మన ప్రయత్నాలలో విఫలమైనా నిరుత్సాహపడకుండా పట్టదలతో, ఓర్పుతో విజయానికి సిద్దం కావాలని దశరథరామిరెడ్డి విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కుటుంబ సభ్యులు ప్రోత్సాహాన్ని తమ పిల్లలకు అందించాలని అప్పుడే పిల్లలు తమ కలలను సాకారం చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. సివిల్స్ కు ఎంపికయిన వీరు ప్రజలకు నాణ్యమైన సేవలను సత్వరమే అందేటట్లుగా సేవ చేయాలని ఆయన సూచించారు. సమాజం మెచ్చుకునేటట్లుగా, కుటుంబ సభ్యల గౌరవాన్ని పెంచేటట్లుగా వారు పనితీరును మెరుగుపరిచేందుకు కృషి చేసుకోవాలని ఆయన కోరారు. సివిల్స్ కు ఎంపికకై తాము చేసిన కృషిని, అనుభవాలను తోటి విద్యార్థులకు మార్గదర్శకం చేయాలని మిగతా విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ఉత్తమ ఫలితాలను సాధించుకోగలరని దశరథరామిరెడ్డి అభిప్రాయపడ్డారు.