NandyalAbdul Javid

మానవులంతా ఒక్కటే, మతం కంటే మానవత్వం గొప్పదని నినదించిన ఈద్ మిలాప్

మానవులంతా ఒక్కటే, మతం కంటే మానవత్వం గొప్పదని నినదించిన ఈద్ మిలాప్

నంద్యాల (పల్లెవెలుగు) 08 మే: మానవులంతా ఒక్కటే, మతం కంటే మానవత్వం గొప్పదని ఈద్ మిలాప్ లో వక్తలు ముక్తకంఠంతో నినదించారు. జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో స్ధానిక శ్రీ వివేకానంద ఆడిటోరియంలో “ఈద్ మిలాప్” ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జమాఆతె ఇస్లామీ హింద్ ఆ.ప్ర రాష్ట్ర అధ్యక్షులు  డా.ముహమ్మద్ రఫీక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు సీ.ఇసాక్ బాషా, అతిథి వక్తలుగా కర్నూలు శివదీక్ష పీఠాధిపతి గురుజీ ఈశ్వర స్వామి, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత  డా.జి.రామకృష్ణా రెడ్డి, బ్రాహ్మణ అపరకర్మల సంఘం అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది రావినూతల దుర్గా ప్రసాద్, సర్దార్ దర్శన్ సింగ్ కాలరా, కౌన్సిలర్ మరియు ఏపియూడబ్లుజే జిల్లా అధ్యక్షులు కే. శ్యాంసుందర్ లాల్,  ఎస్ఐఓ రాష్ట్ర అధ్యక్షులు ఎజాజ్ అహమ్మద్ పాల్గొన్నారు. స్థానిక సందేశ విభాగ కన్వీనర్ సైఫుల్లా ఖుర్ఆన్ పారాయణం తో ప్రారంభమైన కార్యక్రమంలో జమాతె ఇస్లామి జిల్లా బాధ్యులు షబ్బీర్ హుసేన్ సంస్థను పరిచయం చేస్తూ గత ఎనిమిది దశాబ్దాలుగా జమాత్ కృషిని వివరిస్తూ కరోనా కాలంలో చేసిన ఎనలేని సేవలు వివరించారు. రాష్ట్ర అధ్యక్షులు డా.రఫీక్ మాట్లాడుతూ ఈ అనంత సృష్టిని యుగాలుగా క్రమశిక్షణతో నడిపే శక్తి ఒక్క దైవానికే ఉందని, నిర్వీర్యుడై మానవుడికి మాతృమూర్తి ద్వారా జన్మనిచ్చి శక్తివంతుడు చేసిన దైవానికి మరణాంతరం బ్రతికించడం కష్టం కాదు, ఈ జీవితం క్షణభంగురం, అందుకే మానవ జీవితం దైవనిర్దేషితమే కావాలని స్పష్టపరిచారు. ఈద్ మిలాప్ కు మూలం రమజాను మాసం అని, ఈ మాసంలో పవిత్ర దైవ గంధం ఖుర్ఆన్ అవతరించిందని, ఖుర్ఆన్ ప్రసాదించిన మానవ విలువలు, మహిళా హక్కులు, దైవభీతి తదితర అంశాలు సోదాహరణంగా వివరించారు. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాక అగ్రరాజ్యంగా భాసిల్లాలని రిఫీక్ ఆకాంక్షించారు. డా.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విజ్ఞానులు మతాలను గురించి మాట్లాడరని మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారే మతవైశమ్యాలకు ఆజ్యం పోస్తారని, ఇలాంటి ఈద్ మిలాప్ లు మనసు లను కలుపుతాయన్నారు. అన్ని మతాలవారు పరస్పరం కలిసి ఉన్నప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని హితవు పలికారు.  రావినూతల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఈశ్వర్ అల్లా ఒక్కరే నని, మానవుడిగా ఆది గ్రంథాలు అందిరికోసం ఉన్నాయి, ఎక్కడ కులాల ప్రస్తావన లేనపుడు మనం దూరం కాకుండా అయ్యామియ్యా ఒక్కటిగా ఉందామని ఉల్లాసంగా మాట్లాడారు. శ్యాంసుందర్ లాల్ మాట్లాడుతు పూర్వం నుండి పల్లె వాసులు అన్ని మతాలకు అతీతంగా కలిసి అన్నా, మామా, బావ అని వరుసలతో ఆప్యాయంగా పిలుచుకునే వారం అయితె ఈ మధ్య కొందరు అధికారం కోసం, మత పిచ్చితో మానవులు మధ్య అడ్డుగోడ కడుతున్నారు, ఇది ప్రమాదకరం ధోరణీ అని దీనిని అందరు అడ్డుకోవాలని కోరారు.  ఈశ్వర్ స్వామి మాట్లాడుతూ సదా మానవాళి గురించి మాట్లాడే మతం గొప్పదని. ఈశ్వరుడు సర్వ మానవుడి గురుంచి ఉన్నప్పుడు మనం మతాలు కల్పించుకుని పోట్లాటకు దిగడం మూర్ఖత్వం అన్నారు. సర్దార్ దర్శన్ సింగ్ అందరి ఐక్యతే దేశ సుభిక్షంగా అన్నారు. ముఖ్య అతిథి ఇసాక్ బాషా మాట్లాడుతూ ఈ కార్యక్రమం అద్భుతంగా తనను తన్మయంతో ముంచివేసిందని, ఈ ప్రోగ్రాంలో ఎన్నో ఆణిముత్యాలు పొందానని నిజంగా ఆపదల్లో మనం కలిసిపోతాం, శాశ్వితం కాని ఈ లోకంలో మన సేవలు ఆప్యాత అనురాగాలే మనల్ని గుర్తు చేయాలి తప్ప కులమతాలు కాదు అన్నారు. అందరి మనసులు విప్పి మాట్లాడె ఇలాంటి సమావేశాలు చాలా అవసరం అన్నారు. అతిథులకు తెలుగు అనువాద ఖుర్ఆన్ గ్రంథాలు బహుకరించారు. స్థానిక అధ్యక్షులు అబ్దుల్ సమద్ కన్వీనర్ గా వ్రవహరించారు. జాతీయగీత ఆలాపన తో సమావేశం ముగిసింది.

Back to top button