
ఘనంగా సంఘసంస్కర్త బసవేశ్వర స్వామి 891 వ జయంతి ఉత్సవాలు
ఘనంగా సంఘసంస్కర్త బసవేశ్వర స్వామి 891 వ జయంతి ఉత్సవాలు
నంద్యాల (పల్లెవెలుగు) 03 మే: పట్టణంలోని బైరమల్ వీధి నందు గల బసవన్న స్వామి దేవస్థానంలో సంఘసంస్కర్త బసవేశ్వర స్వామి 891 జయంతి ఉత్సవాలు వీరశైవుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు పూజలు నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి పూలమాల తో అలంకరించి బసవేశ్వర స్వామి చేసిన సామాజిక సేవల గురించి వీరశైవ సంక్షేమ సంఘం సభ్యులు కొనియాడారు. ఈ సందర్భంగా వీరశైవ సంక్షేమ సమాజ పట్టణ అధ్యక్షులు కర్నూలు నాగరాజు మాట్లాడుతూ సంఘ సంస్కర్త శ్రీ కళ్యాణ బసవేశ్వర స్వామివారి 891 జయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 12వ దశాబ్దంలోనే బసవేశ్వర స్వామి వారు సమాజంలోని కుల, మతాలను అంటరానితనాన్ని రూపుమాపటానికి వీరశైవాన్ని స్థాపించి ప్రతి ఒక్కరికి లింగ ధారణ చేసి సమాజంలో మనుషులంతా ఒక్కటే అని ప్రజలలో చైతన్యం తెచ్చి ప్రజలను కలిసి మెలిసి ఉండేలా చేశారని అన్నారు. ప్రతి సంవత్సరం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో శ్రీ బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా మంగళవారం బసవన్న స్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సంక్షేమ సంఘ అధ్యక్షులు నాగరాజు, సభ్యులు శివ, నాగేంద్ర, రాజు శంకరప్ప కిషోర్ మల్లికార్జున భాస్కర్ శ్రీనివాస బాబు శివప్ప తదితరులు పాల్గొన్నారు.