Abdul JavidNandyal

పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు

పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదు
పేదరికం కారణంగా చదువులు ఆగిపోరాదు
పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తున్నాం
పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువు
2021–22 విద్యా సంవత్సరానికి రెండో విడత జగనన్న వసతి దీవెన
10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ
నాడు–నేడుతో బడుల రూపురేఖలు మారుస్తున్నాం
పేదల పిల్లల కోసం నాన్నగారు వైయస్‌ఆర్‌ ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు వేస్తున్నా
నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

నంద్యాల,(పల్లెవెలుగు)  ఏప్రిల్ 08 :- ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా…..ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ..ఇవాళ మీ ముందుకు వ‌చ్చాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 

శుక్రవారం తొలిసారిగా నంద్యాల జిల్లా ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాలకు చేరుకొని నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ గ్రౌండ్ లోని బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన’ పథకం కింద రెండో విడతలో 10, 68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు.

అంతకుముందు దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నివాళులు నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…..ఇక్కడే ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేస్తానని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువుగా చేర్చుతానని మొట్ట మొదట నంద్యాలలోనే మాట ఇచ్చాను. ఈ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ..ఇక్కడేకే మీ బిడ్డ‌గా మీముందుకు వచ్చానని సగర్వంగా మీకు చెబుతున్నాను. ప్రతి ఒక్కరికి మీ బిడ్డ ఈ రోజు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామ‌న్నారు. పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. పాదయాత్రలో ఎన్నో గాథలు విన్నా…..విద్యారంగాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేశాం. అరకొరగా కాకుండా పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. భోజనం, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి తెలిపారు.

ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి ఇస్తాం. తల్లుల ఖాతాలోకి రెండు విడతలుగా ఇస్తామ‌న్నారు. జగనన్న వున్నాడని మీరు భరోసాతో వుండండి. అన్నీ నేను చూసుకుంటాను. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లి సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు పిల్లల చదువులకు సంబంధించి అనేక సంస్కరణలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎన్నెన్నో అడుగులు ముందుకు వేశాం. ఈ రోజు మీ అందరికీ కూడా విద్యారంగంలో జరుగుతున్న సంస్కరణలు, పరిణామాలు గమనించమని కోరుతున్నా అన్నారు. ఏ ఒక్క పాప గాని, ఏ ఒక్క బాబు గాని ప్రాథమిక, ఉన్నత విధ్యకు దూరం అయ్యే పరిస్థితి రాకూడదు. ఏ ఒక్క తల్లిదండ్రి అప్పుల పాలు కాకూడదు. ఇది ఒక గొప్ప ఆలోచన. నా పాదయాత్రలో..నా కళ్లేదుటే ఎన్నో గాధలు విన్నా..

చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఈ చదువు అనే అస్తి పిల్లలకు ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకురావు. సమూలంగా విద్యారంగాన్ని మార్చే దిశగా అడుగులు వేశాం అన్నారు. పేద విద్యార్థులకు అయ్యే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చి ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు తోడుగా నిలిచాం అన్నారు.

గతంలో మాదిరిగా కాకూండా పూర్తి ఫీజు రీయింబ్స్‌మెంట్‌ ఇచ్చి ఆదుకున్నాం అన్నారు. మరోవైపు భోజనం వసతి ఖర్చులకు తల్లిదండ్రులు, పిల్లలకు ఇబ్బంది పడకూడదు. వేలల్లో ఉన్న ఖర్చులకు ఇబ్బందులు పడకూడదన్న పరిస్థితి రాకూడదు. నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చూశాం. ఆయన చనిపోయిన తరువాత పాలకులు నీరుగార్చారు. నాన్నగారు పేద పిల్లల చదువుల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..అదే నాన్నకు కొడుకుగా జగన్‌ అనే నేను.. రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి పూర్వ వైభవం తీసుకువస్తూ..కొన్ని మార్పులు కూడా చేశాం అన్నారు. జగనన్న వసతి దీవెన పథకాన్ని తీసుకువచ్చాం అన్నారు.

ఈ రోజు నంద్యాల గడ్డ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10,68,150 మంది పిల్లలకు మంచి జరిగేలా 9,61,140 తల్లుల ఖాతాల్లోకి నేరుగా  బటన్‌ నొక్కి రూ.2021–2022 ఏడాదికి రెండో విడతగా రూ.1024 కోట్లు జమ చేస్తున్నాన‌ని సగర్వంగా చెబుతున్నా అన్నారు.

జగనన్న వసతి దీవెనల కింద కాలేజీలకు వెళ్లి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులకు రూ.20 వేలు ఆ తల్లుల ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన ద్వారా ప్రతి ఏటా రెండో దఫాల్లో ఈ సొమ్ము ఇస్తున్నాం. ఈ రోజు రెండో విడతగా రూ.1024 కోట్లు ఇస్తున్నాం అన్నారు.

ఒక కుటుంబంలో ఒకరికే పరిమితం చేసే రోజులు పోయాయి. ఒక కుటుంబంలో ఎంత మందిని చదివించినా గాని ఫర్వాలేదు. మీరు మీ పిల్లలను చదివించండి. ఎంతమందిని చదివించినా కూడా మీ అన్న జగన్‌ తోడుగా ఉంటానని ప్రతి చెల్లెమ్మకు చెబుతున్నా. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు. చదువుతోనే మన తల రాతలు మారుతాయి అన్నారు. ఈ రోజు వసతి దీవెన కింద ఇచ్చే ఈ డబ్బులు ఈ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. దీని వల్ల కాలేజీల్లో జవాబుదారితనం వస్తుంది. తల్లులు వెళ్లి ఫీజులు కట్టినప్పుడు ఆ కాలేజీల్లో ఉన్న వసతులపై విచారణ చేస్తారు. కాలేజీల్లో వసతులు లేకపోతే ఆ తల్లులు ప్రశ్నించవచ్చు. ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఆ కాలేజీలపై చర్యలు తీసుకుంటాం అన్నారు. తల్లులకు నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల వారికి ప్రశ్నించే హక్కు వస్తుంది. కచ్చితంగా కాలేజీలు జవాబుదారితనంతో వ్యవహరిస్తాయి. మెరుగైన వసతులు వస్తాయి. చదువుల పరంగా మనం ఎన్ని మార్పులు చేశామో కూడా ఒక్కసారి ఈ మూడేళ్లను గమనించాలి అన్నారు.

రాష్ట్రంలో ఎంత పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా ఆ ప్రతి తల్లి, పాప, బాబు కూడా ఈ రోజు చదువులు చదవాలి. మెరుగైన చదువులు చదవాలన్న తపనతో విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాం. చిన్న పిల్లలు చదివే స్కూళ్ల రూపురేఖలు మారాయి. ఆ పిల్లలకు మంచి ఆహారం అందిస్తున్నాం. ఏమి తింటే ఆ పిల్లలు బాగుంటారు. ఏం తింటే వారికి బోరు కొట్టకుండా ప్రతి రోజు ఒక రకంగా మెనూ ఉండేలా ఆలోచన చేశాను. ఏ ముఖ్యమంత్రి ఇలాంటి ఆలోచన చేసి ఉండరు. ఆ పిల్లలు తినే భోజనానికి గోరుముద్ద పేరుతో మంచి భోజనం అందిస్తున్నానని సగర్వంగా చెబుతున్నా. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మార్చేశాం. బడుల్లో నాడు–నేడు కార్యక్రమంతో రూపురేఖలు మారుతున్నాయి. గతంలో బాత్‌రూమ్‌లకు వెళ్తే నీరు ఉండదు, స్కూళ్లలో బ్లాక్‌ బోర్డులు ఉండవు, ఫర్నిచర్‌ ఉండదు. వంటగదులు కూడా ఉండవు, పెయింటింగ్‌ ఉండేది కాదు. శిథిలావస్థలో స్కూళ్లు ఉండేవి. పూర్తిగా రూపురేఖలు మార్చుతున్నాం. ఈ రోజు బైలివింగ్‌ టెస్ట్‌బుక్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చాం. స్కూళ్లు అన్నీ కూడా పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం చేస్తూ అడుగులు ముందుకు వేశాం. ప్రభుత్వ బడికి మళ్లీ మంచి రోజులు తీసుకురావడం జరిగింది అన్నారు.

విద్యావిధానాన్ని రాబోయే తరం అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి పది సంవత్సరాల తరువాత, 15, 20 సంవత్సరాల తరువాత మన పిల్లలు ఆ ప్రపంచంలో మన పిల్లలు పోటీపడి నెగ్గేలా ఈ రోజు పూర్తిగా విద్యారంగం రూపురేఖలు మార్చుతున్నాం. స్కూళ్ల నుంచి కాలేజీ వరకు రూపురేఖలు మార్చుతున్నాం అన్నారు. కొత్తగా ఈ రోజు మన రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. స్వాతంత్రం తరువాత మనకు 11 కాలేజీలు మాత్రమే ఉండేవి. నంద్యాల పట్టణంలో కొత్త మెడికల్‌ కాలేజీ కూడా వస్తుంది. స్కీల్‌ డెవలప్‌మెంట్‌కాలేజీ కూడా వస్తోంది. మైక్రోసాప్ట్‌ సర్టిఫికెట్‌ కూడా కాలేజీలకు అనుసంధానం చేశాం. జాబ్‌ ఓరియేంటేడ్‌గా మార్చుతున్నాం. కాలేజీల్లో చదువుతున్న కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ విధానం తీసుకువస్తున్నాం. స్పెషలైజేషన్‌ కోర్సులు, 65 ఒకేషనల్‌ కోర్సులు ప్రవేశపెడుతున్నాం. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులు తీసుకువస్తున్నాం అన్నారు.

రాష్ట్రంలో ఏ తల్లి అయినా కూడా తన పిల్లలకు మంచి చదువులు చదివించాలని ఆరాటపడుతోంది. ఆ తల్లులకు పేదరికం అడ్డురాకూడదు. వారిని ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడ జరగని విధంగా పిల్లలను బడికి పంపించే 1 నుంచి 12వ తరగతి వరకు ఆ తల్లులకు మంచి చేస్తూ జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నాం. అటెండెన్స్‌కు జత కడుతూ ప్రతి ఏటా రూ.15 వేలు చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ రోజు అక్షరాల 44 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. నిజంగా దేవుడు ఇంతగా వారికి మేలు చేసేందుకు అవకాశం ఇవ్వడం ఇంతకన్న మరొక సంతోషం ఉండదు. ఈ రోజు నా అక్కచెల్లెమ్మల కోసం ఒక్క అమ్మ ఒడి మాత్రమే కాదు. వారికి తోడుగా ఉండేందుకు వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు , సున్నా వడ్డీ రుణాలు, ఆర్థిక సాధికారత కోసం కార్పొరేట్‌ సంస్థలతో ఈ రోజు ఒప్పందాలు చేసి బ్యాంకులతో టైఅప్‌లు ఇచ్చాం. ఇలా అనేక అడుగులు ముందుకు వేశాం. అక్కచెల్లెమ్మలు బాగుంటే పిల్లలు బాగుంటారనే నమ్మకం, విశ్వాసంతో మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెబుతూ సగర్వంగా అడుగులు ముందుకు వేశాం అన్నారు.

ఈ రోజు పిల్లల చదువుల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో గమనిస్తే..పిల్లలను వారి చదువులే కాకుండా, వారి శారీరక, మానసిక ఎదుగుదల కోసం వారి ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నాను. తల్లితో పాటు వారి గర్భంలో ఉన్న శిశువులకు కూడా మంచి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ అనే గొప్ప కార్యక్రమం తీసుకువచ్చాం. ఆరు నెలల నుంచి 6 ఏళ్ల పిల్లల ఎదుగుదల కోసం వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ తీసుకువచ్చాం. ఈ పథకానికి గతంలో రూ.600 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ రోజు ఏడాదికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం. వైయస్‌ఆర్‌ గోరుముద్ద అనే పథకానికి శ్రీకారం చుట్టాం. గతంలో ఈ పథకానికి ఏడాదికి రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ రోజు ఈ పథకానికి రూ.1900 కోట్లు అక్షరాల ఖర్చు చేస్తున్నామని సగర్వంగా చెబుతున్నా. పిల్లలకు మంచి జరగాలని చెప్పి ఈ పథకాన్ని తీసుకురావడమే కాకుండా పౌష్టికాహారం కూడా ఇస్తున్నాం. గత ప్రభుత్వం హయాంలో తక్కువగా ఉన్నజీఈఆర్‌ రేషియో, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లల సంఖ్యను.. పెంచిన ఘనతను తమ ప్రభుత్వానిదేనని, ఇది గమనించమని ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి కోరారు.

అదేవిధంగా మెడికల్ కళాశాల పనులు బాగా జరుగుతున్నాయి 12 కిలోమీటర్ల వరకు రోడ్డు వేయాలని నంద్యాల ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకు వచ్చారని వెంటనే మంజూరు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే ఆటోనగర్ ను మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. మిర్చి పంటలకు సంబంధించి మిర్చి మార్కెటింగ్ సెంటర్ కూడా తీసుకొస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వై ఎస్ ఆర్ నగర్ ను అన్ని మౌలిక వసతులు కల్పించి బాగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు.

దేవుడి దయతో మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

అనంతరం జగనన్న వసతి దీవెన పథకం కింద రెండో విడతలో 10, 68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయల మెగా చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులుకు అందజేశారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ నంది విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి బహుకరించారు.

స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ 

2017 ఉప ఎన్నికల్లో నంద్యాల ఎస్పీజీ మైదానం ఉండే నంద్యాల జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానని మాట ఇచ్చి నెరవేర్చినందుకు నంద్యాల జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. నంద్యాల గడ్డలో అపార ఖనిజ సంపద, అటవీ సంపదతో పాటు అనేక పరిశ్రమలు వున్నాయని… ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ లు ఇక్కడి నుండే ఎన్నుకోబడ్డారని జిల్లా కావాలని ఎన్ని మార్లు అడిగినా ప్రజల కలగానే మిగిలిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చాక నంద్యాలను జిల్లాగా ప్రకటించి నంద్యాల జిల్లా ప్రజల కలను సంతోషకరంగా వుందన్నారు. నంద్యాల పట్టణంలో 477 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఉత్తర్వులు మంజూరు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి నంద్యాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారని కుందు నది వెడల్పు కోసం నిధులు మంజూరు చేశారన్నారు. రహదారి విస్తరణలో స్థలాలు కోల్పోయిన బాధితులకు 26 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని మన ప్రభుత్వంలో ఇచ్చామన్నారు ఆటోనగర్ లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వడంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారన్నారు. నంద్యాల చుట్టుప్రక్కల రెండు జాతీయ రహదారులను కలుపుతూ 12 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయవలసిందిగా ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు ఆటోనగర్లో లో బ్లూ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచి మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు మిర్చి రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు వైఎస్ఆర్ నగర్ లో ఇళ్ల ఇళ్ల పట్టాలు మంజూరు తోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.

జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ

నంద్యాల వాసులు తమ ప్రాంతం జిల్లా కావాలని, తమ పల్లెలు ప్రగతి బాటలో నడవాలని ప్రజలు కోరుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాలను జిల్లాగా ప్రకటించడం శుభపరిణామమన్నారు. జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ళ కల, ఎన్నో విశేషాలు వున్న నంద్యాల జిల్లాకు నన్ను తొలి కలెక్టర్ గా నియమించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాలకు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు.  నవనందులు వెలిసిన ప్రాంతం నంద్యాల నంది ఆలయమే నంద్యాలగా పిలవబడుతోందన్నారు. భారత దేశంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, అహోబిలం, మహానంది, యాగంటి క్షేత్రాలతో నంద్యాల మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధికెక్కిందన్నారు. 9,681 కిలోమీటర్ల వైశాల్యంతో 29 మండలాలు కలిగిన నంద్యాల జిల్లాగా రూపొందించుకుందన్నారు. జగనన్న వసతి దీవెన లబ్ధిదారులైన ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈ బీసీ, కాపు, క్రిస్టియన్ మైనారిటీల కుటుంబాలకు రెండున్నర లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువగా ఉంటే ఈ పథకానికి అర్హులవుతారు. జగనన్న విద్యా దీవెన కింద ఐటిఐ విద్యార్థులకు 10 వేల రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేల రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 20 వేల రూపాయలు చొప్పున పూర్తి రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడుతుంది అన్నారు.

నంద్యాలకు చెందిన విద్యార్థిని కరణం బృహతి మానస మాట్లాడుతూ

తాను రామకృష్ణ కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నట్టు తెలిపింది. జగనన్న అందిస్తున్న వసతి దీవెన పథకం కింద ఏడాదికి రూ.20 ఇవ్వడం తన లాంటి మధ్య తరగతికి చెందిన కుటుంబాల అమ్మాయిలకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పింది. నవరత్నాల్లో భాగంగా విద్యా దీవెనను ప్రవేశపెట్టినందుకు సీఎం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపింది. వసతి దీవెన పథకం వల్ల ఎంతో మంది విద్యార్థులు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చదువుతున్నారని పేర్కొంది. ప్రభుత్వం అందించే రూ. 20వేల ద్వారా ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు, హాస్టల్స్‌ చార్జీలు, పౌషికాహారం అందుతోందని సంతోషం వ్యక్తం చేసింది. అమ్మఒడి పథకం వల్ల తన తమ్ముడు శ్రీరామ చంద్ర బడిలో మంచిగా చదువుకుంటున్నాడని తెలిపింది. తన లాంటి ఎంతో మంది జగనన్న వల్ల ఈ రోజు చదువుకుంటున్నారని చెప్పింది. కాగా, తన తండ్రి ఆలయ అర్చకులుగా ఉన్నారని….జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వారికి జీతాలు డబుల్‌ అయ్యాయని.. దీంతో ఆర్థికంగా తన కుటుంబం నిలదోక్కుకుందని ఆనందం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు అన్ని తన ఇంట్లోనే ఉన్నాయని చిరునవ‍్వులు చిందించింది. ప్రతీ నెల ఒకటవ తేదీన వలంటీర్లు వచ్చి పెన్షన‍్లు అందిస్తున్నట్టు తెలిపింది. చివరగా నంద్యాల సభ సాక్షిగా ధన్యవాదాలు చెబుతూ.. జగనన్న వల్ల తాను బాగా చదువుకుని లాయర్‌ అయ్యి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జడ్పి ఛైర్మన్ ఎర్రపోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా భగీరథ రెడ్డి, ఇషాక్ భాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామి రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి, తోగూర్ ఆర్థర్, కె.శ్రీదేవి, నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీరారెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబున్నీషా, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Back to top button