NandyalAbdul Javid

మహిళల చైతన్యంతోనే రాయలసీమ హక్కుల సాధన

మహిళల చైతన్యంతోనే రాయలసీమ హక్కుల సాధన

  • రాయలసీమకు దశాబ్దాలుగా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.

నంద్యాల (పల్లెవెలుగు) 31 డిసెంబర్: స్థానిక మండలం కానాల గ్రామంలోని నారాయణ పాండే పబ్లిక్ స్కూల్ ఆవరణలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో గురువారం నాడు మహిళలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఎంతో మందికి రాయలసీమ ఉన్నత పదవులు అందించినా రాయలసీమ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల చైతన్యంతోనే రాయలసీమ వెనుకబాటుతనం తొలగించవచ్చని ఆయన తెలిపారు. మన అవగాహన లోపం వలన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినా సిద్దేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు, త్రాగు నీటిలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, 70 ఏళ్ల అనంతరం మళ్ళీ రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన రాయలసీమలో నిర్మాణంలో ఉన్న  హంద్రీ – నీవా, గాలేరు- నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలు మరియు ప్రకాశం జిల్లాలోని వెలుగొండ  ప్రాజెక్టులకు అనుమతులు వున్నా కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో ఈ ఏడు ప్రాజెక్టులను అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొన్నారనీ, ఈ ఏడు ప్రాజెక్టులకు ఆరు నెలల కాలంలో అనుమతులు పొందకపోతే ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయినప్పటికీ వీటికి చుక్క నీరు కూడా విడుదల చేయమని కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో పేర్కొనడం బాధిస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన ఈ ఏడు ప్రాజెక్టులకు కృష్ణా నది యాజమాన్య బోర్డులో అనుమతులు ఇప్పించి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేసారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతం కాని విశాఖపట్నం లో KRMB ని ఏర్పాటు చేస్తామనడం విడ్డూరంగా వున్నదని, కృష్ణా నది నీటి పంపిణీలో కీలకంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో వున్నందున కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.

రాయలసీమలో సాగు, త్రాగు నీటి కోసం ఆయా ప్రజా ప్రతినిధులను ఆ ప్రాంత ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలలో ప్రజలను జాగృతం చేసేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామనీ,కానాల గ్రామంలో ఎక్కువ మంది మహిళలు తరలిరావడం అభినందనీయమని ఆయన అన్నారు.మహిళలు కూడా పొదుపు, ఐక్య సంఘాల సమావేశాలలో సాగు, త్రాగునీటిపై చర్చించి అవగాహన పెంచుకోవాలని దశరథరామిరెడ్డి సూచించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉద్యమంలో మహిళలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అపర్ణ, రామచెన్నమ్మ ,సునీత, జమాలమ్మ, వెంకటసుబ్బమ్మ, నాగమ్మ, కృష్ణవేణి, మస్తానమ్మ, లహరి రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు సుధాకర్ రావు, రమణారెడ్డి, నారాయణ పాండే పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసపాండే, ప్రతాపరెడ్డి మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Back to top button