Abdul JavidNandyal

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేదే యోగా

  • యోగాతో ఆరోగ్యంతో పాటు ఒత్తిడిని తట్టుకునే శక్తి
  • ఆదివారం అధునాతన జిమ్, యోగా కేంద్రాన్ని ప్రారంభించనున్న ఎంపి, ఎమ్మెల్యేలు
  • ఆయుష్ యోగా సేవాసమితి నిర్వాహకులు ఆనంద్ గురుజీ

నంద్యాల (పల్లెవెలుగు) 08 అక్టోబర్:: శారీరక, మానసిక, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేదే యోగా అని, యోగాతో ఆరోగ్యంతో పాటు ఒత్తిడిని తట్టుకునే శక్తి కలిగి ఉంటుందని ఆయొష్ యోగా సేవా సమితి నిర్వాహకులు ఆనంద్ గురూజీ పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ టౌన్ హాల్ పక్కన గల మున్సిపల్ పార్కునందు ఆయుష్ యోగా సేవా సమితి కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆనంద్ గురూజీతో పాటు 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యాంసుందర్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ గురూజీ మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీ ఆదివారం ఆయుష్ యోగా కేంద్రంలో 8 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అధునాతన జిమ్ ను నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ షేక్ మాబున్నిసా,  కమిషనర్ వెంకట కృష్ణుడు తదితర ప్రముఖులు ప్రారంభిస్తారని, కావున పుర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పది హేను సంవత్సరాల నుండి తాను యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నానని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజల ఆరోగ్యమే మహా భాగ్యంగా, వారిని తీర్చిదిద్దేందుకు తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆనంద్ గురూజీ తెలిపారు. నేటి ఆధునిక కాలంలో మనుషులు కాలంతో పోటీ పడుతూ తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నారని, చిన్న తనంలోనే అనేక వ్యాధులు, రుగ్మతలు వస్తున్నాయని, వాటిని రూపు మాపేందుకు యోగా చక్కటి వ్యాయామమని పేర్కొన్నారు. 8నెలల పాటు కష్టపడి యోగా సభ్యులతో దాదాపు 89 లక్షల విరాలాలు సేకరించి ఈ కేంద్రంలో జిమ్ తదితర పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నడుము నొప్పి (బ్యాక్ పెయిన్), స్థూలకాయం (ఒబెసిటి), రక్తపోటు (బిపి), మధుమేహం (షుగర్) వున్న వారికి విడివిడిగా శిక్షణ ఇవ్వబడుతుందని  యోగాలో జలధౌతి, జలనేతి, సూత్రనేతి, వస్త్రధౌతి, సంఖ ప్రక్షాళన, క్రియలు నేర్పబడునని, కావున ఆసక్తి గలవారు ఈ యోగా కేంద్రంలో చేరి ఆరోగ్య వంతులుగా మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో 12 వ వార్డ్ కౌన్సిలర్, ఎపియుడబ్ల్యుజే జిల్లా ఉపాధ్యక్షులు శ్యామసుందర్ లాల్, విలేకరి ఉస్మాన్, జవిద్, మహేష్ బాబు, రామచంద్రయ్య, శ్రీనివాసులు, యోగా గురువులు మరియు విలేకరులు పాల్గొన్నారు.

Back to top button