
వక్ఫ్ బోర్డు స్థలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం వెంటనే నిలిపివేయాలి మైనారిటీ రైట్స్ ఫోరమ్
నంద్యాల (పల్లెవెలుగు) 27 ఆగష్టు: పట్టణంలోని స్థానిక కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మైనారిటీ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ గుంటూరు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల నాగుల రెడ్డి గూడెం అనే గ్రామంలో 150 సంవత్సరాల చరిత్ర గల వక్ఫ్ బోర్డు సంబంధించిన సర్వే నంబర్ 206 స్థలంలో ఈద్గా మసీదు ఉన్నదని అందులో రైతు భరోసా కేంద్రం ఆముల్ పాల కేంద్రం ప్రాధమిక చికిత్స కేంద్రాలను నిర్మించడానికి స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు అధికారులను అదేశించి నిర్మాణం చేపట్టడం తగదన్నారు. వక్ఫ్ స్థలంలో ప్రభుత్వ భవనాలు నిర్మించడాన్ని ఖండిస్తూ మా ఈద్గా స్థలం మాకు కావాలి అని నినాదాలు చేస్తూ రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ముస్లిం ప్రజానీకంపై భారీగా పోలీసులను మోహరించిన లాఠీ ఛార్జ్ చేయడం చాలా దారుణమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వక్ఫ్ భూముల రీసర్వే చేయించి డిజిటలైజేషన్ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకపొగ వక్ఫ్ స్థలాలు కాపాడాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు వక్ఫ్ స్థలాలను లాక్కొని ప్రభుత్వ భవనాలు నిర్మించడం ఏంటని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ముస్లిం సమాజంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే అక్కడ జరుగుతున్న నిర్మాణాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు