Abdul JavidKurnool City

జనరిక్ మెడికల్ స్టోర్ లలో తక్కువ ధరకే నాణ్యమైన మందులు

  • జనరిక్ మెడికల్ స్టోర్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  • జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు

కర్నూలు (పల్లెవెలుగు) సెప్టెంబర్ 22:  జనరిక్ మెడికల్ స్టోర్ లలో తక్కువ ధరకే నాణ్యమైన మందులు లభించునని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు పేర్కొన్నారు.  బుధవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్ నందు జనరిక్ మందుల షాపుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకే నాణ్యమైన మందులు విక్రయించాలని జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు జనరిక్ మందుల షాపులలో మంచి క్వాలిటీతో లభించే మందులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో 2, నంద్యాలలో-1 జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేయడం జరిగిందని జనరిక్ మందుల షాపుల నిర్వాహకులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తప్పకుండా మందుల షాపు తెరిచి ఉంచాలన్నారు. మందుల షాపుల నిర్వాహకులు జనరిక్ మందుల షాపుల గురించి విస్తృత ప్రచారం కల్పించే టట్లు చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. మందుల షాపులో పనిచేసే ఫార్మసిస్టు లు షిఫ్ట్ ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. జనరిక్ మందుల షాపుల అభివృద్ధికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి వెంకటేశ్వర్లు, మెప్మా పిడి శిరీష, నంద్యాల జిజిహెచ్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, జనరిక్ మందుల షాపుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button