Abdul JavidKurnool City

ఆకస్మికంగా గ్రామ సచివాలయాలు తనిఖీ

  • ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించండి
  • ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలి
  • సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలి
  • సచివాలయ సేవల గురించి ఇంటింటికి తెలియజేయాలి
  • సచివాలయ సిబ్బందికి ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు :-

కర్నూలు, (పల్లెవెలుగు) ఆగస్టు 18 : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. బుధవారం కల్లూరు మండలం, చిన్నటేకూరు మరియు లక్ష్మీ పురం గ్రామ సచివాలయం-2 ను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువు లోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో ఎంత మంది జనాభా ఉన్నారు, అందులో ఎంత మంది పురుషులు…మహిళలు… పిల్లలు…ఉన్నారు…ఎంత మందికి పెన్షన్ వస్తుంది, తదితర వివరాలన్ని తమ దగ్గర ఉండాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సచివాలయంలో పరిధిలో ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారు…45 సంవత్సరాల పైబడిన వారు ఎంత మంది పురుషులు, మహిళలు ఉన్నారు… వారిలో ఎంత మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు… ఇంకా రెండవ డోస్ ఎంత మంది వేయించుకోవాలి వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి తెలుసుకున్నరు. గర్భిణీలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం చాలా అవసరమని…ఆ దిశగా మీ పరిధిలోని గర్భిణీలను  మోటివేషన్ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని ఏఎన్ ఎంకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

తమ గ్రామ పరిధిలోని మహిళలకు దిశా యాప్ పై అవగాహన కల్పించాలని మహిళా పోలీస్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉన్న ఊర్లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చిందని….మీ గ్రామంలో ఉన్న ప్రజలకు మంచి సేవలు అందించి ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ గ్రామ సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks