
ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి – ఏఐఎస్ఎఫ్
దేవనకొండ ( పల్లె వెలుగు ) ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేసే జీవో నెంబర్ 42 వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా అనంతపురంలో ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల లో విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, దేవనకొండ మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ రాస్తారోకోకు సిపిఐ దేవనకొండ మండల సమితి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ ధర్నాకు ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కె.భాస్కర్ అధ్యక్షత వహించారు.ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి ఎమ్.నరసరావు, సహాయ కార్యదర్శి ఎమ్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గులేకుండా పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్న టువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసి వేయడం చాలా దారుణమైన విషయం అని అన్నారు. తక్షణమే ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించేలా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా శాంతియుతంగా ధర్నా చేస్తే అక్రమ అరెస్టులు, లాఠీఛార్జ్ చేయటం చాలా సిగ్గుచేటైన విషయమని ఆరోపించారు. అనంతపురం నగరంలో విద్యార్థుల మీద లాఠీ చార్జి చేసినటువంటి పోలీసులను సస్పెండ్ చేయాలని, జీవో నెంబర్ 42 రద్దు చేయాలని మరి అమ్మ ఒడి పథకాన్ని కొనసాగించాలని, పేద మధ్యతరగతి విద్యార్థులు తక్కువ ఫీజులతో విద్యను కొనసాగిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలు ఉన్న పలంగా ప్రైవేట్ కు అప్పజెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గతంలో రెండు వేల రూపాయలు ఫీజు ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు 15 వేల రూపాయలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ఎయిడెడ్ పాఠశాలను, కళాశాలను మూసివేత ఆలోచన విరమించుకోవాలని లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు లోకేష్, నబీరసూల్, సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.