Devanakonda

“ఘనంగా విప్లవకెరటం చేగువేరా వర్ధంతి”

ప్రపంచ నేతల నుండి దేశదేశాల యువత వరకు ఎందరికో స్ఫూర్తి ప్రదాత “చేగువేరా”

దేవనకొండ (పల్లె వెలుగు)  ప్రపంచ నేతల నుండి దేశదేశాల యువత వరకు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా “చేగువేరా” నిలిచాడని ఏఐఎస్ఎఫ్ – ఏఐవైఎఫ్ మండల నాయకులు కె.భాస్కర్, బి.రవికుమార్, జి. ఫయాజ్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం “చేగువేరా 54వ వర్ధంతిని” పురస్కరించుకుని స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ – ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చేగువేరా ప్రపంచ మెరిగిన విప్లవకారుడు అని కొనియాడారు. దక్షిణ ఆఫ్రికా ఖండానికి చెందిన చేగువేరా అసలు పేరు ఎర్నేస్టో గువార అని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదం లోని సాంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించడం తెలిపారు. చేగువేరా ఒక తిరుగుబాటు చిహ్నం, పీడిత ప్రజల ఆరాధ్యుడు, వీరోచిత పోరాటానికి పెట్టింది పేరు, సాహసమే ఆయన ఊపిరి, విశ్వ జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వీరుడు అని వారు పేర్కొన్నారు. తన రచనల్లో గెరిల్లా యుద్ధం గురించి వివరించిన చేగువేరా వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మితమవ్వాలని కోరుకున్నాడని తెలిపారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలతో తల్లడిల్లిపోతున్న ప్రస్తుత తరుణంలో వీటి నుంచి విముక్తమయ్యేందుకు ఇందుకు అవసరమైన విప్లవోద్యమలను సృష్టించేందుకు ప్రపంచ జనులంతా ముఖ్యంగా నేటి తరం యువత చేగువేరా రచనలు అధ్యయనం చేయాలని తెలిపారు. ఇండియా అనుసరిస్తున్న అలీనోద్యమాన్ని కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా బలపరిచాడని అన్నారు. నేడు దానిని మోడీ ప్రభుత్వం విస్మరిస్తోంది, అమెరికాకు దాసోహం అంటూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టింది, దీనిపై పోరాడటమే చేగువేరా కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు రంగస్వామి, శేఖర్,  పులి, హరికృష్ణ, శంకర్, రఫీ, శక్షావలి, విష్ణు,శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Back to top button