దేవనకొండ మండలం ను కరువు మండలంగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ కు వామపక్షాల విన్నపం

kurnool collector
  • నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి..
  • బ్యాంకుల్లో ఉన్న రైతుల అప్పులను రద్దు చేసి ఆర్థిక భరోసా కల్పించాలి..

దేవనకొండ (పల్లె వెలుగు) 28 సెప్టెంబర్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవనకొండ మండలంను కరువు మండలం గా ప్రకటించి తక్షణమే రైతులను ఆదుకోవాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కు వామపక్షాల ఆధ్వర్యంలో దేవనకొండ లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి. వీర శేఖర్, సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్. నరసరావులు మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షం కొరత తీవ్రం కావడంతో ఇప్పటికే రైతులు వేసిన వేరుశనగ, పత్తి, టమోటా, ఆముదము, కంది వంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన చెందారు. దాదాపుగా ఎకరాకు 20 వేల నుండి 30 వేల రూపాయల వరుకు పెట్టుబడులు పెట్టిన రైతు వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర నష్టానికి గురవుతున్నారని తెలిపారు. అలాగే బ్యాంకుల్లో ఉన్న రైతుల అప్పులను రద్దు చేసి ఆర్థిక భరోసాను కల్పించాలని కోరారు. కరువు నెలకొన్న కారణంగా ప్రభుత్వం స్పందించి దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకునేందుకు ఎకరాకు పరిహారం గా 50 వేల ఇవ్వాలని కోరారు. మండలం లో ప్రవహించే హంద్రీనీవాకు సంబంధించి పంట కాలువ ల నిర్మాణం పెండింగ్లో ఉన్నందున సాగునీరు అందడం లేదని, మండలంలో పొలాలకు సాగునీరు పూర్తి స్థాయిలో అందాలంటే పంట కాలువలు నిర్మించి సాగునీటి ని అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గత 30 సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరిన డిఎన్టీ హాస్టల్ కు సొంత భవనం నిర్మించి హాస్టల్ లో చదువుకునే వీలు కల్పించాలని వారు కోరారు. అదేవిధంగా జిల్లాలో అన్ని మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయని వైశాల్యపరంగా పెద్ద మండలం గా ఉన్నా దేవనకొండ మండలం లో ఆదర్శ పాఠశాల లేకపోవడం విద్యార్థులకు తీవ్ర కొరత ఉందని కావున ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్.ఎం.యూసుఫ్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి నెట్టేకల్, మండల నాయకులు రాజన్న, భాస్కర్,మధు, పుల్లయ్య, రఘు, భాష, సుల్తాన్, రైతులు పెద్దన్న, రంగన్న, తదితరులు పాల్గొన్నారు.