
దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి..
నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి..
దేవనకొండ (పల్లె వెలుగు) 20 సెప్టెంబర్: మండల వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా మండల రైతాంగాన్ని ఆదుకునేందుకు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్. నరసరావు, సహాయ కార్యదర్శి ఎమ్. వెంకటేశ్వర్లు, సిపిఎం పట్టణ కార్యదర్శి యూసుఫ్ బాష, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎమ్.నెట్టేకల్, జనసేన మండల అధ్యక్షులు నరేంద్ర లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం మండల అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి లకు మెమోరాండం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు అరకొర వర్షాలు పడుతూ ఉండడం వలన రైతుల వేసుకొన్న పంటలు చేతికందే పరిస్థితి లేదన్నారు. కావున రైతులకు పంటలపై పెట్టిన పెట్టుబడులు సైతం చేతికందే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అలాగే మండలంలో ప్రవహిస్తున్న హంద్రీనీవా నీళ్లు అరకొరగానే రైతులకు అందుతున్నాయి. తద్వారా పంట కాలువల నిర్మాణం పూర్తి కాక పోవడం కూడా రైతులకు శాపం గా ఉంది అన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వేసుకున్న పత్తి, వేరుశనగ, ఆముదము, టమోటా, ఉల్లి, మిరప తదితర పంటలన్నీ ఇదివరకే నష్టపోయి ఉన్నాయి. కావున పక్షిమ ప్రాంతంలో వరుస కరువు కాటకాలతో నిత్యం కరువుకు గురి అవుతున్నటువంటి అన్నదాతలను ఆదుకోవడానికి సంబంధిత ఉన్నతాధికారులు దేవనకొండ మండలం పై ప్రత్యేక దృష్టి సారించి నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి ఆదుకునేందుకు తక్షణమే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి నష్టపోయిన ప్రతి రైతును ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు సుల్తాన్ సాబ్, రామాంజనేయులు, ఫయాజ్, వీరేష్, శ్రీనివాసులు, సలాం, గోవిందు, మురళి, రాజు తదితరులు పాల్గొన్నారు.