eastgodavariM.Subrahmanyam

తోట త్రిమూర్తులు మంత్రి పదవి???

తోట త్రిమూర్తులు మంత్రి పదవి???

మండపేట (పల్లెవెలుగు) 20 మర్చి:  శాసన మండలి సభ్యుడు తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి వరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది.  అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మంత్రి పదవైన రెండున్నరేళ్లు మాత్రమేనని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే లకు మంత్రి పదవులు కట్టబెట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో  చురుగ్గా వ్యవహరిస్తున్న తోట త్రిమూర్తులును జిల్లా నుంచి పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన 11 జిల్లాలకు తోట అంటే తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. పార్టీ ఏదైనప్పటికీ తోటకు తరగని ప్రజాదరణ ఉందని గుర్తించిన జగన్ కూడా సుముఖంగా ఉన్నట్లు అమరావతి వర్గాల ద్వారా తెలియ వచ్చింది. 2024 ఎన్నికల్లో  జనసేన పార్టీ కాపులను బలంగా ప్రభావితం చేయనుంది. కాపులను జనసేన పార్టీ వైపు మరల్చడానికి ఆ పార్టీ వర్గాలు ఇప్పటి నుండి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో రెండు జిల్లాల్లో కాపుల దృష్టి వైసీపీ వైపు మళ్లించడానికి తోటకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. పైగా మండపేట నియోజక వర్గంలో తోట అడుగు పెట్టాక అన్నీ వరుస విజయాలే దక్కడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మండపేట మున్సిపాలిటీని ముప్పై ఏళ్లుగా చెప్పు చేతల్లో పెట్టుకున్న దేశం కంచు కోటను సునాయాసంగా ఢీ కొట్టి పురపాలక సంఘం మీద జెండా ఎగురవేసిన మొనగాడిగా జగన్ వద్ద తోటకు మంచి గుర్తింపు రావడం విశేషం. ఆ సమయంలో మంచి మార్కులు తెచ్చుకున్న తోట జగన్ నుంచి ప్రశంసలు కూడా పొందారని ఈ అంశాలు కూడా తోటకు మంత్రి పదవిని దగ్గర చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటి నుండో మండపేట నియోజక వర్గ పరిస్థితులను ఆకళింపు చేసుకుని మనసులో పెట్టుకొన్న జగన్ 2024లో నియోజక వర్గంలో వైసీపీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలియ వచ్చింది. ఈ నేపథ్యంలో రేపు ఉగాదికి చేపట్టబోయే మలిదశ మంత్రివర్గంలోకి తోటను తీసుకొని సముచిత గౌరవం ఇస్తారని జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్య సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తర్వాత ఖాళీగా ఉన్న రెవెన్యూ శాఖ గాని వ్యవసాయ శాఖ గానీ తోటకు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇలా వుండగా ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ పొత్తులతో పాటు గెలుపు వైపు సాగాలనే పవన్ కళ్యాణ్ డైలాగులు పార్టీని కొంచెం కదిపి నట్లుగానే వినిపిస్తోంది. గతంలో కూడా సినీనటుడు పవన్ వేసిన పంచ్ డైలాగులు రాజకీయాల్లో పనిచేయవని ఇదివరకే రుజువు అయింది. తిరిగి ఇప్పుడు పరిస్థితి మారింది. ముప్పేట దాడితో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చేసిన శపథంపై వైసీపీ పార్టీ కూడా తన వ్యూహాలను రచించు కుంటున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. వేసవిలో కూడా కాక రేపుతున్న రాజకీయాలుగా మారిన ఆంధ్ర ప్రదేశ్ లో అనుభవంతో పాటు అపార జనాదరణ ఉన్న తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి ఇవ్వడం సముచితమే నని ఇది కూడా రాజకీయ వ్యూహంలో భాగమేననంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

Back to top button